Homeనేషనల్Defection : దీదీకి దిమ్మతిరిగే షాక్.. దిల్లీలో దారితప్పిన తృణమూల్ ఎంపీలు: చీలిక అంచున టీఎంసీ!

Defection : దీదీకి దిమ్మతిరిగే షాక్.. దిల్లీలో దారితప్పిన తృణమూల్ ఎంపీలు: చీలిక అంచున టీఎంసీ!

Big Shock to Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రం ఊహించని మలుపులు తిరుగుతోంది. దశాబ్దానికి పైగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) కంచుకోట ఇప్పుడు దిల్లీ వేదికగా బీటలు వారుతోంది. ఒకప్పుడు దీదీకి అత్యంత సన్నిహితులుగా, పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఎంపీలే ఇప్పుడు కమలం గూటికి క్యూ కడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి సతమతమవుతున్న మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి.. ఇప్పుడు పార్లమెంటులోనూ కోలుకోలేని దెబ్బ తగలనుందా? కేంద్రమంత్రి నివాసంలో అర్ధరాత్రి జరిగిన ఆ రహస్య మంతనాల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? 

- Advertisement -

దిల్లీలో అర్ధరాత్రి మంతనాలు.. చక్రం తిప్పుతున్న కమలనాథులు : తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నిలువునా చీలిపోయే ప్రమాదంలో పడింది. ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశం కోసం మమతా బెనర్జీ దిల్లీకి చేరుకున్న సమయంలోనే, ఆమె సొంత ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత భూపేంద్ర యాదవ్ నివాసంలో 20 మందికి పైగా టీఎంసీ లోక్‌సభ సభ్యులు అత్యంత రహస్యంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి స్వయంగా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘ఆపరేషన్ బెంగాల్’ పేరుతో జరుగుతున్న ఈ వ్యవహారంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు, ఆయన వ్యూహాత్మకంగా తృణమూల్ ఎంపీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

స్పీకర్‌ను కలవనున్న రెబల్స్.. వ్యూహం ఇదే : కేవలం అసమ్మతి రాగంతో సరిపెట్టకుండా, రాజ్యాంగబద్ధంగా తమను తాము కాపాడుకునే పకడ్బందీ ప్లాన్‌తో టీఎంసీ రెబల్స్ పావులు కదుపుతున్నారు.
ప్రత్యేక గ్రూపు గుర్తింపు: ఇవాళ లేదా రేపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తమను టీఎంసీ నుంచి విడిపోయిన ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని ఎంపీలు అధికారికంగా కోరనున్నారు.

ఫిరాయింపుల చట్టం నుంచి రక్షణ: యాంటీ డిఫెక్షన్ లా (Anti-Defection Law) కింద అనర్హత వేటు పడకుండా ఉండాలంటే లోక్‌సభలో పార్టీకి ఉన్న మొత్తం బలంలో కనీసం మూడింట రెండొంతుల (2/3rd) మంది ఎంపీలు చీలిక వర్గంలో ఉండాలి. లోక్‌సభలో టీఎంసీకి 28 మంది సభ్యులుండగా.. కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో దాదాపు 20 మంది ఎంపీలు ఇప్పటికే సువేందు అధికారితో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ మ్యాజిక్ ఫిగర్ దాటితే, వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉండదు.

దీదీకి ఎన్నడూ లేని గడ్డుకాలం : గతంలో పార్టీలో చిన్నపాటి అసమ్మతి వచ్చినా ఇనుపకచ్ఛడంగా అణచివేసే మమతా బెనర్జీ.. ఇప్పుడు సొంత పార్టీ నేతలే బహిరంగంగా ధిక్కరిస్తుండటంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సుఖేందు శేఖర్ రాయ్ లాంటి సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేయడంతో మొదలైన ఈ ప్రకంపనలు.. ఇప్పుడు ఏకంగా పార్లమెంటరీ పార్టీ చీలిక స్థాయికి చేరాయి. ఒకవేళ ఈ 20 మంది ఎంపీలు అధికారికంగా ఎన్డీయే (NDA) కూటమికి మద్దతు ప్రకటిస్తే, అది జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలకు, ముఖ్యంగా ఇండియా బ్లాక్‌కు కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News