Tamil Nadu CM Vijay Trichy speech : తమిళనాడు రాజకీయ ముఖచిత్రంపై దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టి, అధికార పీఠాన్ని అధిరోహించిన ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత విజయ్ సంచలన వ్యాఖ్యలతో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. తిరుచిరాపల్లి (తిరుచ్చి) వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాలు తమపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూనే, మరోవైపు బద్ధ శత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకేలు అధికార దాహంతో తెరవెనుక ఎలా చేతులు కలిపాయో కుండబద్దలు కొట్టారు.
బద్దలైన కులమతాల గోడలు : తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న పాత తరం రాజకీయాలకు టీవీకే పార్టీ చరమగీతం పాడిందని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో కులం, మతం, ఓటుకు నోటు వంటి అడ్డంకులను తమ పార్టీ విజయవంతంగా బద్దలు కొట్టిందని ఆయన ఉద్ఘాటించారు. తాము కేవలం ప్రజల మద్దతుతోనే ఈ స్థాయికి చేరుకున్నామని, కానీ ఓర్వలేని ప్రతిపక్షాలు తమపై ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ లాంటి నిరాధారమైన, చౌకబారు ఆరోపణలు చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ తరహా ఆరోపణలను తాను ముక్తకంఠంతో ఖండిస్తున్నానని, తమది స్వచ్ఛమైన ప్రజాబలంతో ఏర్పడిన ప్రభుత్వమని తేల్చి చెప్పారు.
తెరవెనుక ద్రవిడ పార్టీల దోస్తీ : బహిరంగంగా బద్ధ శత్రువుల్లా కత్తులు దూసుకునే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు.. తీరా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి మాత్రం తెరవెనుక సిగ్గులేకుండా చేతులు కలిపాయని విజయ్ బాంబు పేల్చారు. టీవీకే అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు, పరోక్షంగా చీకటి ఒప్పందాలు చేసుకుని కుట్రలు పన్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో డీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూడటానికి ఆ పార్టీ అనుసరిస్తున్న ‘కుటుంబ రాజకీయాలే’ ప్రధాన కారణమని ఆయన విమర్శించారు. ఒకే కుటుంబం చేతిలో అధికారం బందీ కావడం వల్లే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారన్నారు.
నేను సీఎంని కాదు.. మీ తొలి సేవకుడిని : పదవీ వ్యామోహం తనకు లేదని, ప్రజలు తనపై ఉంచిన అపారమైన నమ్మకమే తనను ఈ స్థానంలో కూర్చోబెట్టిందని సీఎం విజయ్ భావోద్వేగంగా పేర్కొన్నారు. “తమిళనాడు ప్రజలు నన్ను కేవలం ముఖ్యమంత్రిని (CM) మాత్రమే చేయలేదు.. తమకు సేవ చేసుకునే ‘ప్రథమ సేవకుడిని’ (First Servant) చేశారు” అని వ్యాఖ్యానించారు. ప్రజా సేవకే తన ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అలాగే, రాజకీయంగా డీఎంకే తమ పార్టీని ఎంతగా విమర్శిస్తే, ఎంతగా వ్యతిరేకిస్తే.. టీవీకే పార్టీకి క్షేత్రస్థాయిలో అంతగా మైలేజ్, మేలు జరుగుతుందని విజయ్ నొక్కిచెప్పారు.

