Special Integrated Revision: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)ను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటనను ఈ రోజు సాయంత్రం 4.15 గంటలకు మీడియా సమావేశంలో తెలపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు 15 రాష్ట్రాల్లో మొదటి విడత ఎస్‌ఐఆర్‌ను చేపట్టే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ..కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ (ఎస్ఐఆర్) అంశంపై దృష్టి సారించింది.
బీహార్ తరహాలోనే దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం నిర్వహించే మీడియా సమావేశంలో ఎస్ఐఆర్‌పై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తొలిదశలో భాగంగా 10 నుంచి 15 రాష్ట్రాల్లో చేపట్టనున్న ఎస్ఐఆర్ పై ఈసీ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సీఈవోల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ మేరకు పలు సూచనలు చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు ఎస్ఐఆర్‌పై ఉన్న అనుమానాలను కమిషనర్ నివృత్తి చేశారు.
వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్‌ఐఆర్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగబోయే రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను ఇప్పుడే ప్రారంభించవద్దని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తలమునకలై ఉంటారు. అందుకే వారు ఎస్‌ఐఆర్ విధుల్లో పాల్గొనే పరిస్థితి ఉండదు. కాబట్టి తదుపరి దశలోనే ఈ ప్రక్రియ చేపడతారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. సమగ్ర సవరణ తర్వాత 7.42 కోట్ల మంది ఓటర్లతో తుది జాబితాను ఈసీ జారీ చేసింది. అంతే కాకుండా అనర్హులైన 3.66 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. ఓటర్లు మరణించడం, శాశ్వతంగా వలస వెళ్లడం, డూప్లికేట్ ఎంట్రీ తదితర కారణాలతో ఈ పేర్లను తొలగించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు.


