PM Modi Visit Northeast states: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దాదాపు ₹5,000 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు.
భారీ కన్వెన్షన్ సెంటర్‌కు శంకుస్థాపన: అరుణాచల్ ప్రదేశ్ రాజధాని అయిన ఇటానగర్‌లో ప్రధాని మోదీ పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జలవిద్యుత్ ఉత్పత్తికి అనువైన అరుణాచల్‌లో దాదాపు ₹3,700 కోట్లతో నిర్మించనున్న తాతో-1, హియో జలవిద్యుత్ కేంద్రాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా 9,820 అడుగుల ఎత్తులో తవాంగ్‌లో నిర్మించనున్న భారీ కన్వెన్షన్ సెంటర్‌కు సైతం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
మాతా త్రిపుర సుందరి ఆలయం: అరుణాచల్ పర్యటన అనంతరం ప్రధాని త్రిపుర బయలుదేరుతారు. శక్తిపీఠాలలో ఒకటైన గోమతి జిల్లాలోని ఉదయ్‌పుర్‌లో ఉన్న మాతా త్రిపుర సుందరి ఆలయ సముదాయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశమవుతారని పీఎంవో పేర్కొంది.
Also Read: https://teluguprabha.net/national-news/gst-savings-festival-begins-tomorrow/
నేటి నుంచి జీఎస్టీ 2.0 అమలు: జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో సెప్టెంబర్ 21న జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దేశ ప్రజలకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. ఈ జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఏంతో మేలు జరుగుతోందని చెప్పారు. కొత్త జీఎస్టీతో ప్రజల డబ్బు ఆదా అవుతుందని అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా కొత్త అధ్యాయం మొదలైంది. జీఎస్టీకి ముందు పన్నుల విధానం గందరగోళంగా ఉండేది. రకరకాల పేర్లతో ఎన్నో పన్నులు ఉండేవి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకు రవాణా చేయాలన్నా పన్నులు కట్టాల్సి వచ్చేది. గతంలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తువులు తీసుకొచ్చి అమ్ముకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది. టోల్, ట్యాక్స్‌లతో కంపెనీలు ఇబ్బంది పడేవి. ఆ ప్రభావం వినియోగదారులపై పడటం ద్వారా అధిక ధరలకు వస్తువులు కొనుగోలు చేయాల్సి వచ్చేది. అందుకే. మేం అన్ని రకాల పన్నులను రద్దు చేసి 2017లో జీఎస్టీ తీసుకొచ్చాం. 2024లో గెలిచిన తర్వాత జీఎస్టీలపై ప్రాధాన్యం ఇచ్చాం. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాం. జీఎస్టీ సంస్కరణలతో అన్నీ వర్గాలతో మాట్లాడాం. వన్ నేషన్-వన్ ట్యాక్స్ అనే మధ్య తరగతి ప్రజల చిరకాల కలను సాకారం చేశాం. జీఎస్టీ సంస్కరణలతో పెట్టుబడులు ప్రవాహం పెరుగుతుంది.” అని పేర్కొన్నారు.


