Toll Fee: ఏడాదికి ఒకేసారి టోల్ ఫీజు కట్టే అవకాశాన్ని ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టోల్ ఛార్జీల లెక్కింపు నిబంధనల్లో మోదీ సర్కారు చేసిన మార్పుల్లో.. సొరంగ మార్గాలు, ఫ్లై ఓవర్లు, వంతెనలు వంటివి కలిగిన రహదారుల్లో టోల్ ఫీజును సగానికి తగ్గించేందుకు కసరత్తులు చేస్తుంది. దీంతో ప్రయాణ ఖర్చులపై కొంతమేర ఉపశమనం లభించనుంది.
2008 నాటి జాతీయ రహదారుల టోల్ ఫీజు నిబంధనలను అనుసరించి టోల్ ప్లాజాల్లో యూజర్ ఛార్జీలను నిర్ణయించారు. తాజాగా ఈ నిబంధనల్ని కేంద్రం సవరించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సొరంగాలు, వంతెనలతో పాటు ఇతర నిర్మాణాలు ఉన్న జాతీయ రహదారిలో టోల్ ఫీజు లెక్కించేందుకు ఓ కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు.
కొత్తగా సవరించిన రూల్ ప్రకారం.. ఏదైనా ఓ రహదారిపై ఉన్న నిర్మాణ పొడవును పదితో హెచ్చించి, దాన్ని నేషనల్ హైవే సెక్షన్ పొడవుతో కలిపి లెక్కిస్తారు. అయితే అందులోంచి నిర్మాణ పొడవును తీసివేత చేస్తారు. అలాగే నేషనల్ హైవే సెక్షన్ పొడవును ఐదుతో హెచ్చిస్తారు. ఈ రెండు సమీకరణాల ద్వారా లభించిన ఫలితాల్లో ఏది రుసుము చూపిస్తే దాన్ని ప్రాతిపదికను టోల్ ఫీజు లెక్కిస్తారట. ఇదే విషయాన్ని జూలై 2న ప్రకటించిన ఓ నోటిఫికేషన్‌లో వెల్లడైంది. ఈ కొత్త పద్ధతి ద్వారా ఆయా మార్గాల్లో టోల్ ఫీజు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని జాతీయ రహదారుల విభాగం అధికారి ఒకరు స్పష్టం చేశారు.