Top Court Orders Man To Give Rs 4 Crore Mumbai Flat To Ex-Wife: ఓ విడాకుల కేసులో సంచలన తీర్పు ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం. పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకున్న ఒక జంటకు విడాకులు మంజూరు చేసిన సుప్రీం కోర్టు, భర్త తన మాజీ భార్యకు ముంబైలో అతడికి చెందిన రూ. 4 కోట్ల విలువైన ఫ్లాట్‌ను ఇవ్వాలని ఆదేశించింది.
ఎనిమిదేళ్ల పోరాటం..
పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా ఇద్దరి మధ్య తీవ్ర వివాదాలు, న్యాయ పోరాటాలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వారిద్దరూ తిరిగి కలిసి ఉండే అవకాశం లేదని సుప్రీంకోర్టు భావించింది. అందుకే, వారి వివాహ బంధం పూర్తిగా విచ్ఛిన్నమైందని నిర్ధారించి, విడాకులు మంజూరు చేయడం సరైనదని పేర్కొంది.
భరణంగా ఫ్లాట్ బదిలీ..
గతంలో బ్యాంకర్‌గా పనిచేసిన భర్త ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు. అయినా సరే, తన మాజీ భార్యకు న్యాయం చేయాలని కోర్టు నిర్ణయించింది. ఆమెకు భరణంగా ముంబైలోని ఓ విలువైన ఫ్లాట్‌ను బదిలీ చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆ ఫ్లాట్‌కు సంబంధించిన నిర్వహణ ఖర్చుల బకాయిలను కూడా సెప్టెంబర్ 1, 2025లోగా చెల్లించాలని ఆదేశించింది.
భార్య తన మాజీ భర్తపై గతంలో దాఖలు చేసిన సెక్షన్ 498-ఏ (క్రూరత్వం), 406 (విశ్వాస భంగం) కేసులను కోర్టు రద్దు చేసింది. భర్తపై ఉన్న కేసుల్లో ఆధారాలు అసంపూర్తిగా ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.


