Saturday, November 15, 2025
Homeనేషనల్Traffic Fines : ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో జాప్యమా? ఇంటికే ఇక ఈ-కొరడా!

Traffic Fines : ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో జాప్యమా? ఇంటికే ఇక ఈ-కొరడా!

Pending traffic challan home notice : మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పేరుకుపోయాయా?  పదుల సంఖ్యలో ఉన్నా… తర్వాత చూద్దాంలే అని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త! మీ నిర్లక్ష్య ధోరణికి కళ్లెం వేసేందుకు పోలీసు శాఖ సరికొత్త అస్త్రం సంధించింది. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తూ, జరిమానాలు చెల్లించకుండా మొండికేస్తున్న వాహనదారుల భరతం పట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇకపై మీ ఇంటికే నేరుగా నోటీసులు పంపి, కఠిన చర్యలు తీసుకోనుంది. ఇంతకీ ఈ కొత్త విధానం ఎక్కడ మొదలైంది.? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి.?

- Advertisement -

ట్రాఫిక్ నిబంధనలను గాలికి వదిలేస్తున్న వారిపై ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్ ట్రాఫిక్​ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఎన్నిసార్లు చలానాలు విధించినా కొందరిలో మార్పు రాకపోవడం, పెండింగ్ చలానాల సంఖ్య భారీగా పేరుకుపోవడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా, “ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్​ మేనేజ్​మెంట్ సిస్టమ్​ (ITMS)” అనే అధునాతన సాంకేతికతను ప్రవేశపెట్టనున్నారు. ఇది నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి, చలాన్ జారీ చేస్తుంది.

ఇక ఇప్పటికే పేరుకుపోయిన బకాయిల వసూళ్లపై కూడా అధికారులు దృష్టి సారించారు.
గుర్తింపు ప్రక్రియ:  10 లేదా అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. గాజియాబాద్ పరిధిలో సుమారు 41,000 వాహనాలు ఈ జాబితాలో ఉన్నట్లు అధికారులు తేల్చారు.

నోటీసుల జారీ: ఆగస్టు 19వ తేదీ నుంచే ఈ వాహనాల యజమానులకు నేరుగా వారి చిరునామాలకు నోటీసులు పంపే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సంబంధిత ట్రాఫిక్ ఏఎస్పీ జారీ చేసే ఈ నోటీసులో, వాహనంపై ఉన్న మొత్తం పెండింగ్ చలానాల వివరాలు స్పష్టంగా పొందుపరుస్తున్నారు.

15 రోజుల గడువు: నోటీసు అందుకున్న వాహన యజమాని, 15 రోజుల వ్యవధిలో బకాయిపడ్డ మొత్తం జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.

కఠిన చర్యలు: గడువులోగా చెల్లింపు జరపని పక్షంలో, అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తారు. మోటారు వాహన చట్టం 1988లోని సెక్షన్లు 19, 53, 54 మరియు మోటారు వాహన నిబంధనలు 1986లోని సెక్షన్ 21 ప్రకారం, సదరు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), డ్రైవింగ్ లైసెన్స్ (DL) లను రద్దు చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు.

ఈ విషయంపై గాజియాబాద్ ట్రాఫిక్ ఏఎస్​పీ సచ్చిదానంద్ మాట్లాడుతూ, “మొదటి రోజే సుమారు 150 మందికి పైగా ఉల్లంఘనులకు నోటీసులు జారీ చేశాం. చట్టప్రకారం 15 రోజుల్లోగా స్పందించని వారి వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేస్తాం” అని స్పష్టం చేశారు.

వాహనదారులు తమ పెండింగ్ చలానాల వివరాలను అధికారిక ప్రభుత్వ వెబ్​సైట్ http://echallan.parivahan.gov.in ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. వెబ్​సైట్​లో వాహన నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ లేదా చలాన్ నంబర్ నమోదు చేసి బకాయిల వివరాలను తనిఖీ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad