Karnataka: కర్ణాటకలోని హసన జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హొళెనరసీపుర తాలూకా మొసళె సహళ్లి సమీపంలో జాతీయ రహదారిపై గణేష్ నిమజ్జనానికి వెళ్తున్న భక్తులపైకి ఒక ట్రక్కు వేగంగా దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది భక్తులు మరణించగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాదం జరిగిన తీరును పోలీసులు వెల్లడించారు. హసన నుంచి హొళెనరసీపురానికి వస్తున్న ట్రక్కుకు ఎదురుగా ఒక ద్విచక్ర వాహనం అకస్మాత్తుగా వచ్చింది. దాన్ని తప్పించే ప్రయత్నంలో ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అదే సమయంలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం కోసం ఊరేగింపుగా తీసుకువెళ్తున్న భక్తుల సమూహంపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఊహించని ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ట్రక్కు వేగానికి ఊరేగింపులో ఉన్నవారు చెల్లాచెదురయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హొళెనరసీపురలోని ప్రభుత్వాసుపత్రికి, హసన జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హసన జిల్లా ఎస్పీ మహ్మద్ సుజేతా, మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ప్రమాదం హసన జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది


