Train Ticket Regret Sankranti 2026: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే పండుగ సంక్రాంతి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగకు రెండు నెలల ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటారు. తాజాగా, సంక్రాంతికి రైళ్ల టికెట్ల రిజర్వేషన్ ప్రారంభించిన క్షణాల్లో అన్ని రైళ్ల టికెట్లు బుక్కైపోయాయి. తెలంగాణ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల టికెట్లు కేవలం 5 నిమిషాల్లో అమ్ముడుపోయాయి. టికెట్లు దొరక్క చాలా మంది నిరాశకు గురయ్యారు.
ప్రయాణికులకు సంక్రాంతి టెన్షన్..
రిజర్వేషన్ల కోసం ఇండియన్ రైల్వే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గతంలో మూడు నెలలకు ముందు ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకునేవారు. ప్రస్తుతం దాన్ని రెండు నెలలకు కుదించారు. ఈ క్రమంలోనే రెండు నెలలు ముందుగా రైల్వే టికెట్లకు బుకింగ్స్ ఓపెన్ చేయగా.. అన్ని టికెట్లు క్షణాల్లో అయిపోయాయి. చాలా రైళ్లకు రిగ్రెట్ అని వచ్చేసింది. దీంతో, ఈ సంక్రాంతికి మరిన్ని స్పెషల్స్ ట్రైన్స్ వేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది భోగి పండుగ జనవరి 13న వస్తోంది. ఆ రోజు మంగళవారం కావడంతో ముందుగానే ప్రయాణికులు రైళ్ల టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. టెక్ ఉద్యోగులతో పాటు చాలామంది శుక్రవారం నుంచి టికెట్లు బుక్ చేసుకోవడం మొదలుపెట్టారు. వరుస సెలవులతో మరికొందరు సోమ, మంగళవారం నుంచి ఆయా తేదీలకు బుకింగ్ చేసుకున్నారు.
బుకింగ్ ఓపెనైన ఐదు నిమిషాలకే క్లోజ్..
బుకింగ్ ఓపెన్ కాగానే కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో టికెట్లు అయిపోయాయి. చాలా రైళ్లకు రిగ్రెట్ అని వచ్చింది. దీంతో ప్రయాణికులు నిరాశకు గురయ్యారు. చాలామంది ఆధార్ లింక్ చేసుకోలేదు. చివరకు ఆధార్‌కు లింకు చేసేసరికి దాదాపుగా అన్ని రైళ్లకు టికెట్లు అయిపోయారు. కొన్నింటికి 150 వరకు వెయిటింగ్ లిస్టు రాగా, మరికొన్నింటికి రిగ్రెట్ అని వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు దాదాపు డజనుకు పైగా రైళ్లు ఉన్నాయి. జన్మభూమి, ఈస్ట్‌కోస్ట్, విశాఖ ఎక్స్‌ప్రెస్, గోదావరి, ఫలక్‌నుమా, గరీభ్‌రథ్ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లతో పాటు కోణార్క్ , మహబూబ్ నగర్- విశాఖ వంటి రైళ్లకు భారీ వెయిటింగ్ లిస్టు వచ్చేసింది. దీంతో జంట నగరాల నుంచి ఏపీలోని సొంతూళ్లకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నవారు ఆవేదన చెందుతున్నారు. తమకు స్పెషల్ రైళ్లు మాత్రమే దిక్కని వాపోతున్నారు. ఇప్పుడు ప్రజల చూపంతా ప్రత్యేక రైళ్లపై పడింది. ఈసారి సంక్రాంతికి రైలు ప్రయాణికులకు కష్టాలు తప్పవనే సంకేతాలు వినిపిస్తున్నాయి.


