Madhya Pradesh plane crash: మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో సోమవారం సాయంత్రం రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన ఒక శిక్షణా విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్, ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ ఇద్దరూ గాయపడ్డారు. ఈ ప్రమాదం 33 కేవీ హై వోల్టేజ్ విద్యుత్ తీగను ఢీకొట్టడం వల్ల జరిగింది. సియోనిలోని సుక్తారా ఎయిర్‌స్ట్రిప్ నుండి టేకాఫ్ చేసిన ఈ విమానం తిరిగి రన్‌వేకు వస్తుండగా.. సాయంత్రం 6:25 గంటల సమయంలో అమగావ్ వ్యవసాయ క్షేత్రాల సమీపంలో కూలిపోయింది.
అకాడమీ ప్రతినిధులు మొదట్లో ఇంజిన్ పవర్ ఆగిపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులకు తెలిపారు. ఇంజిన్ పనిచేయకపోవడంతో ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ తక్షణమే ఎయిర్ కంట్రోలర్‌ను సంప్రదించి, సమీప పొలాల్లో సురక్షితంగా ల్యాండింగ్ చేయాలని పైలట్‌కు సూచించారు. అయితే రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా విమానం కింద భాగం బాదల్‌పార్ సబ్‌స్టేషన్‌కు చెందిన 33 కేవీ విద్యుత్ లైన్‌ను బలంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. భారీ శబ్దం వచ్చి, మంటల రూపంలో విద్యుత్ స్పార్క్స్ ఎగిరిపడ్డాయని, ఆ తర్వాత విమానం నేలకూలిందని అమగావ్ సర్పంచ్ రామ్‌లాల్ ఉయికే చెప్పారు.
also read Pub safety : మన పబ్‌లు, క్లబ్‌లు సురక్షితమేనా? గోవా ఘటనతో భాగ్యనగరంలో భయం!
ఈ ప్రమాదంలో పైలట్ అజిత్ చావడా, ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ అజిత్ ఆంథోని గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్థులు, విద్యుత్ పంపిణీ సంస్థ సిబ్బంది, పోలీసులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని సియోని నగరంలోని బారాపథర్ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదం కారణంగా విద్యుత్ తీగలు తెగిపోవడంతో, బాదల్‌పార్, గ్వారీ సబ్‌స్టేషన్ల పరిధిలోని దాదాపు 80 నుంచి 90 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిని పునరుద్ధరించే పనులు చురుగ్గా జరుగుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దుర్ఘటనపై విచారణ జరుగుతోంది.

