Winged termites lifespan and diet : వాన చినుకు నేలను తాకి, మట్టివాసన గుప్పుమందో లేదో.. లైట్ల వెలుగులకు ఆకర్షితులై వేల సంఖ్యలో రెక్కల పురుగులు మన ఇళ్లను ముట్టడిస్తాయి. మనలో చాలామంది వాటిని ‘ఉసిళ్లు’ అని పిలుస్తాం. వాటిని పట్టుకుని, వేయించుకుని ఎంతో ఇష్టంగా తినే సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటినుంచో ఉంది. అయితే, ఈ ఉసిళ్లపై ఎన్నో అపోహలు, సందేహాలు ఉన్నాయి. అసలు ఇవి వర్షాకాలంలోనే ఎందుకొస్తాయి? వాటి జీవితకాలం నిజంగా ఒక్క రోజేనా? అన్నింటికంటే ముఖ్యంగా, వాటిని తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునేందుకు కీటక శాస్త్రవేత్తలు, పోషకాహార నిపుణులతో మాట్లాడినప్పుడు ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
అవి ఉసిళ్లు కావు.. రెక్కలొచ్చిన చెదపురుగులు : మనం ఉసిళ్లు అని పిలుచుకునేవి వాస్తవానికి ప్రత్యేకమైన కీటకాలు కావు, అవి రెక్కలు మొలిచిన చెదపురుగులే. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. ఒక చెదపుట్టలోని సామాజిక వ్యవస్థ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. చీమలు, తేనెటీగల్లాగే ఇవి కూడా సంఘజీవులు. ఒక పుట్టలో రాణి, రాజు, కార్మికులు, సైనికులు అని నాలుగు వర్గాలుంటాయి.
“పునరుత్పత్తి తర్వాత మగ చీమ, మగ తేనెటీగ చనిపోతాయి. కానీ చెదపురుగుల్లో రాజు, రాణి ఏళ్లపాటు కలిసే ఉండి పుట్టను నిర్మిస్తాయి,” అని ప్రముఖ కీటక శాస్త్రవేత్తలు వివరించారు. రాణి చెదపురుగు రోజుకు వేల సంఖ్యలో గుడ్లు పెడుతూ పుట్టను విస్తరిస్తుంది.
వర్షాకాలంలోనే ఎందుకొస్తాయి : ఒక చెదల పుట్టలో కేవలం రాజు, రాణి మాత్రమే కాదు, పిల్లల్ని కనగలిగే ఇతర ఆడ, మగ చెదలు కూడా ఉంటాయి. “ఈ శక్తి ఉన్న చెదలే వర్షాకాలంలో రెక్కలు తెచ్చుకొని కొత్త పుట్టలను నిర్మించడం కోసం బయటకు ఎగురుతాయి. వీటినే మనం ఉసిళ్లు అంటాం,” అని శాస్త్రవేత్తలు తెలిపారు.
“వానాకాలంలోని తేమతో కూడిన వాతావరణం ఇవి ఎగరడానికి, జతకట్టడానికి అనుకూలంగా ఉంటుంది. వర్షం వల్ల మట్టి మెత్తగా మారడంతో, జతకట్టిన జంట కొత్త పుట్టను నిర్మించుకోవడం సులభం అవుతుంది,” అని ప్రముఖ కీటక శాస్త్రవేత్తలు వివరించారు.
ఆయుష్షు ఒక్క రోజేనా? అపోహే : ఉసిళ్ల జీవితకాలం ఒక్క రోజేననడంలో ఎంతమాత్రం నిజం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. “పునరుత్పత్తి కోసం వేల సంఖ్యలో ఉసిళ్లు పుట్ట నుంచి బయటకు వస్తాయి. వాటిలో పక్షులు, కప్పలు, ఇతర కీటకాలకు ఆహారంగా మారి అధికభాగం చనిపోతాయి. కేవలం కొన్ని జంటలు మాత్రమే విజయవంతంగా కొత్త పుట్టను నిర్మిస్తాయి. ఇలా చాలా వరకు చనిపోవడం చూసి, వాటి ఆయుష్షు ఒక్క రోజేననే అపోహ పుట్టి ఉండొచ్చు,” అని నిపుణులు అన్నారు.
ఉసిళ్లను తినడం మంచిదేనా : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో ఉసిళ్లను తినే ఆచారం దశాబ్దాలుగా ఉంది. వీటిని వేయించి, ఎండబెట్టి ఆహారంగా తీసుకుంటారు. వీటిని తినడం ఆరోగ్యకరమేనా అని ప్రశ్నించినప్పుడు, పోషకాహార నిపుణులు సమాధానమిచ్చారు.
“ఉసిళ్లను తినడం చికెన్, మటన్ వంటిదే. ఆరోగ్యకరమైన రీతిలో వండుకుని తింటే ఎలాంటి సమస్య ఉండదు. అయితే, ఇవి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం అనడానికి భారత్‌లో జరిగిన శాస్త్రీయ అధ్యయనాలు, ఆధారాలు చాలా తక్కువ. కాబట్టి దీనిని ఒక సంప్రదాయ ఆహారంగానే చూడాలి,” అని ఆమె పేర్కొన్నారు.


