అందరూ చూస్తుండగానే రైల్వేస్టేషన్లో విషాద ఘటన జరిగింది. ప్లాట్ ఫారమ్ పై మరో వ్యక్తితో నిల్చుని మాట్లాడుతున్న టీటీఈ తలపై హైటెన్షన్ వైర్ (ఓహెచ్ఈ వైరు) తెగిపడింది. ఆ మరుక్షణమే ఆయన అమాంతం వెనుక ఉన్న రైల్వే ట్రాక్ పై పడిపోయాడు. అతడితో మాట్లాడుతున్న మరోవ్యక్తి మాత్రం తృటిలో తప్పించుకున్నాడు. ఇదంతా ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్లో జరగ్గా.. అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డైంది.
బాధిత టీటీఈని సుజన్ సింగ్ సర్దార్‌గా గుర్తించారు. వెంటనే ఆయనను ఖరగ్‌పూర్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. సుజన్ తలతోపాటు ఆయన శరీరంలోని పలుచోట్ల తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. సుజన్ కు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ ఘటనపై ఖరగ్‌పూర్ టీఆర్ఎం మహమ్మద్ సుజత్ హష్మీ మాట్లాడుతూ.. అదృష్టవశాత్తు టీటీఈ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. వైరు తెగి పడడానికి ఖచ్చితమైన కారణం తెలియదని, బహుశా పక్షుల ఇలా జరిగి ఉండవచ్చన్నారు. టీటీఈ విద్యుత్ షాక్ కు గురైన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.