Tamilandu New CM Vijay: తమిళనాడులో మరికొన్ని గంటల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3.15 గంటలకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు పనులు వేగంగా సాగుతున్నాయి. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా(టీవీకే నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు) ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాట రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 234 స్థానాలకు గాను 107 స్థానాలను సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్(118)ను చేరుకోకపోవడంతో విజయ్‌కి ఇతర పార్టీల మద్దతు అవసరమైంది. ఎట్టకేలకు డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్(5), వామపక్షాలు(4), వీసీకే(2), ఐయూఎంఎల్(2) ఈ రోజు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో టీవీకే 120 స్థానాలను సాధించింది. ఈ మేరకు ఈ రోజు గవర్నర్‌కు విజయ్ మద్దతు లేఖలు అందించడంతో విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించారు.
Also Read: https://teluguprabha.net/telangana/special-movie-on-revanth-reddy-political-journey/
ఇదిలా ఉండగా.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ప్రకటించిన వీసీకే.. కేబినెట్ బెర్తులు మాత్రం వద్దని చెప్పింది. తాము ప్రభుత్వంలో భాగం కాబోమని.. వెలుపలి నుంచే మద్దతిస్తామని తెలిపింది. అయితే భవిష్యత్తులో భాగం అవుతామా లేదా అనేది చెప్పలేమని వెల్లడించింది. తాము డీఎంకే కూటమిలోనే కొనసాగుతున్నామని.. తమిళనాడులో రాష్ట్రపతి పాలన రాకుండా ఉండేందుకే టీవీకేకు మద్దతు ఇచ్చామని వీసీకే చీఫ్ తిరుమావళవన్ మీడియాకు తెలిపారు. అయితే ఇప్పటికే వామపక్షాలు సైతం కేబినెట్ పదవులు వద్దని చెప్పిన విషయం తెలిసిందే.

