Tamilnadu Elections TVK Vijay: తమిళనాడులో పార్టీని ప్రారంభించిన రెండేళ్లకే తమిళగ వెట్రి కళగం(TVK) సత్తా చాటింది. ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకతతో కొత్త రాజకీయ శక్తిని కోరుకున్న ఓటర్లు విజయ్‌కి మెజారిటీ ఓట్లతో హారతి పట్టారు. ఫలితంగా తమిళనాట విజయ్ టీవీకే పార్టీ సూపర్ హిట్టయింది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో కోటి 28లక్షల ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఒంటరిగా పోటీ చేసి ఇన్ని ఓట్లు సాధించడం అంటే సాధారణ విజయం కాదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంజేఆర్ తర్వాత అలాంటి స్థాయి రికార్డును విజయ్ తిరగరాశారు.
రాష్ట్రంలో ఇక అధికార డీఎంకే కూటమి రెండో స్థానానికి పరిమితమైంది. డీఎంకే కూటమికి పోలైన ఓట్లు కోటి 17లక్షలు కాగా.. ఆ పార్టీ ఒంటరిగా 83లక్షల ఓట్లు సాధించింది. ఇక అన్నాడీఎంకే కోటి 8 లక్షల ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ పార్టీకి ఒంటరిగా 77 లక్షల ఓట్లు పోలయ్యాయి.
ప్రస్తుతం తమిళనాడులో సీట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతానికి 8 నియోజకవర్గాల్లో టీవీకే గెలుపు జెండా ఎగురవేసింది. డీఎంకే 7 సీట్లను సాధించింది. ఇర పెరంబూర్ నుంచి బరిలో దిగిన విజయ్ సంచలన విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి ఆర్‌డీ శేఖర్‌పై 40 ఓట్ల తేడాతో గెలుపొందారు. మరో స్థానం తిరుచ్చి ఈస్ట్‌లోనూ ఆయన ఆధిక్యం కనబరిచారు. 20వేల ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. తమిళనాట తిరుగులేని ప్రస్థానం సాగించిన సీఎం స్టాలిన్ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. కొళత్తూరు నుంచి పోటీ చేసిన స్టాలిన్.. TVK అభ్యర్థి VS బాబు చేతిలో 9వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాసేపట్లో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. కాగా, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అనూహ్య విజయం సాధించారు. చెపాక్ నుంచి పోటీ చేసిన ఉదయనిధి తొలి నుంచి వెనుకంజలో ఉన్నా.. చివరికి టీవీకే అభ్యర్థి సెల్వంపై 10 వేల ఓట్ల తేడాతో గట్టెక్కారు.

