Karur Stampede Vijay Meet Victims: సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో మృతి చెందిన 41 మంది కుటుంబాలను పరామర్శించాలని విజయ్ నిర్ణయించారు. ఈ మేరకు బాధితులను ప్రత్యేక వేదిక ద్వారా విజయ్ కలవనున్నట్లు అధికారులు తెలిపారు.
కరూర్ తొక్కిసలాట బాధితులను ఇళ్ల వద్ద కాకుండా ఈ నెల 17న విజయ్ ప్రత్యేక వేదిక ద్వారా పరామర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వేదికకు సంబంధించిన వివరాలను ఇంకా తెలుపలేదు. కాగా, బాధితులను విజయ్ పరామర్శించే రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేయాలని పోలీసులను టీవీకే పార్టీ విజ్ఞప్తి చేయగా.. అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇక, మీడియాను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/ips-puran-kumar-suicide-rohtak-sp-transfer/
తిరుచ్చి విమానాశ్రయం నుంచి కరూర్‌లోని వేదిక వరకు విజయ్ వచ్చే మార్గంలో జనం ఎక్కువగా గుడిగూడకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేశారు. కరూర్ వేదిక నుంచి ఒక కిలోమీటరు మేర ప్రజలు ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ వర్గాలు కోరగా.. కేవలం బాధిత కుటుంబాలకు మాత్రమే వేదిక వద్దకు ప్రవేశం ఉంటుందని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. కాగా, కరూర్ తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యం వహించిన పలువురు టీవీకే నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కరూర్ స్టాంపీడ్ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది.


