Saturday, November 15, 2025
Homeనేషనల్Two Helmets: బైక్‌ కొంటే రెండు హెల్మెట్‌లు ఫ్రీ

Two Helmets: బైక్‌ కొంటే రెండు హెల్మెట్‌లు ఫ్రీ


Two Helmets For All New Two Wheelers: దేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అందులోనూ ద్విచక్ర వాహన ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయి. 2022లో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 44.5 శాతం ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే ఉన్నాయి. ఇందులో తలకు దెబ్బలు తగలడం వల్లే తీవ్ర గాయాలతో పాటు మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ముఖ్యంగా హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో టూవీలర్స్ ప్రమాదాలను నియంత్రించేందుకు కొత్త భద్రతా నియమాలను కేంద్రం తీసుకువచ్చింది. బైక్, స్కూటీ కొనుగోలు చేసేవారికి బీఐఎస్ సర్టిఫైడ్ రెండు హెల్మెట్‌లను ఉచితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి కచ్చితంగా ఈ ఆదేశాలు పాటించాలని డీలర్స్ ను ఆదేశించింది.

బైక్ డ్రైవ్ చేసే వ్యక్తితో పాటు వెనకాల కూర్చున్న వ్యక్తి భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం వల్ల కొంతమేర అయినా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించేలా అడుగులు పడతాయని అంచనా వేస్తున్నారు.

అంతేకాకుండా దేశంలో విక్రయించే అన్ని కొత్త ద్విచక్ర వాహనాల్లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ తప్పనిసరి చేస్తూ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 125 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లు, స్కూటీలకు మాత్రమే ఏబీఎస్ నిబంధన ఉంది. ఇకపై ఎంట్రీ లెవల్ మోడల్ వాహనాల్లో ఏబీఎస్ సిస్టమ్ అమలుచేయనున్నారు. దీని వల్ల సడన్‌గా బ్రేక్ వేసినపుడు టైర్లు లాక్ అవకుండా ఉంటాయి. దీంతో బండి స్కిడ్ అయి కింద పడకుండా ఉంటుంది. కొత్త భద్రత నిర్ణయాల ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు యోచిస్తున్నారు.






సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad