Two Prisoners Absconded: జైల్లో నుంచి ఖైదీలు తప్పించుకున్న ఘటనలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇక సినిమాల్లో ఖైదీలు తప్పించుకునే విధానం చూస్తుంటే వీరి తెలివికి హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేం. కాగా, ఇటీవల ఒడిశాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వైపు జైల్లో దసరా వేడుకలు జరుగుతుండగా.. మరో వైపు నేరస్థులు చాలా ప్లాన్డ్‌గా తప్పించుకున్నారు.
దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు జరుగుతుండగా.. ఒడిశాలోని కటక్ జిల్లాలో హై సెక్యూరిటీ ఉండే చౌద్వార్ జైల్లో దసరా వేడుకలు జరుగుతుండగా ఇద్దరు ఖైదీలు సెల్ ఊచలు రంపంతో కోసి తప్పించుకున్నారు. జైల్లో నుంచి ఖైదీలు తప్పించుకోవడం సాధారణ విషయమే అయినా… ఈ ఖైదీలు తప్పించుకున్న తీరు చూసి పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హత్య, దోపిడీ కేసుల్లో నేరస్థులైన ఇద్దరు హై సెక్యూరిటీ చౌద్వార్ సర్కిల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. జైలు అధికారులు, ఇతర ఖైదీలు దసరా వేడుకల్లో లీనమై ఉండగా ఇదే అదునుగా భావించిన ఇద్దరు ఖైదీలు.. సెల్ ఊచలు రంపంతో కోసి దుప్పట్లను ఒకదానికి ఒకటి ముడివేసి తాడు లాగా వాడుకొని జైలు గోడ దూకి పారిపోయారు.
పారిపోయిన ఇద్దరు ఖైదీల్లో బిహార్‌కి చెందిన రాజా సాహ్ని, చంద్రకాంత్ కుమార్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బిహార్‌లోని జాజ్‌పూర్ జిల్లాలో నగల దుకాణంలో చోరీ ఘటనతో పాటు ఇద్దరిని హత్య చేసిన కేసులో వీరిద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల వారిని హై సెక్యూరిటీ జైలుకు తీసుకురాగా వారిని జైలులోని రెండు ప్రత్యేక హై సెక్యూరిటీ సెల్స్‌లో ఉంచామని చెప్పారు. అయినా వారు తప్పించుకోవడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.
శుక్రవారం తెల్లవారుజామున 1: 30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని.. పారిపోయిన ఖైదీలను పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. కాగా, ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు సీనియర్ జైలు అధికారులను సస్పెండ్ చేశారు. అదే సమయంలో ఖైదీలు తమ సెల్స్ లోపలికి రంపాలను ఎలా తీసుకెళ్లగలిగారు, ఊచలను ఎలా కత్తిరించగలిగారు, వారు కత్తిరిస్తున్న సమయంలో వార్డు సిబ్బంది ఎందుకు గమనించలేదు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పారిపోయిన ఖైదీలను పట్టించినవారికి రూ. 50 వేలు రివార్డ్ కూడా ప్రకటించారు.


