UBT-Shiv Sena on India Pak Match: క్రీడా ప్రపంచంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. దీనికి తోడు ఎప్పుడు ఆసక్తిని రేకెత్తించే ఇండియా పాక్ మ్యాచ్ ఈ సారి ఫ్యాన్స్ నుంచి పెద్దగా ఆధరణను కూడా చూడటం లేదు. ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌ను అడ్డుకుంటామని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా హెచ్చరించారు. భారతీయ సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలు అర్పిస్తే దాయాది పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటం దేశభక్తికి అవమానం అని మండిపడ్డారు థాక్రే. మహారాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ మహిళా కార్యకర్తలు నిరసనలకు దిగుతారని, దేశంలోని ప్రతి ఇంటి నుంచి “సింధూర్” పంపి ప్రధాని మోడీకి తమ నిరసన తెలియజేస్తారని చెప్పారు.
కొన్ని నెలల కిందట కాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటం దేశభక్తికి విరుద్ధమని ఉద్ధవ్ థాక్రే వాదిస్తున్నారు. తమ నిరసనలకు ‘సింధూర్ రక్షా అభియాన్’గా పెరుపెట్టినట్లు చెప్పారు థాక్రే.
ప్రధాని మోడీ ఒకప్పుడు ‘నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు’ అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు థాక్రే. మరి అలాంటప్పుడు రక్తం, క్రికెట్ ఎలా కలిసి ప్రవహిస్తాయి? యుద్ధం జరుగుతున్నప్పుడు క్రికెట్ ఎలా ఆడతారు?” అని ప్రశ్నించారు. ఈ మ్యాచ్ కేవలం డబ్బు కోసమేనని, ఇది దేశభక్తి పేరుతో జరుగుతున్న వ్యాపారమని ఆరోపించారు. ఆదివారం శివసేన (యూబీటీ) మహిళా కార్యకర్తలు మహారాష్ట్రలో రోడ్ల మీదకు వచ్చి, ప్రతి ఇంటి నుంచి ప్రధాని మోడీకి సింధూర్ పంపుతారు” అని హెచ్చరించారు. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల బాధను గ్రహించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని థాక్రే కోరారు.
ఇదే క్రమంలో ఉద్ధవ్ కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే కూడా BCCI తీరును తప్పుపట్టారు. పాకిస్తాన్ ఇటీవల భారతదేశంలో జరిగిన పురుషుల హాకీ ఆసియా కప్‌లో పాల్గొననప్పుడు, మనం ఎందుకు పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించకూడదని ఆయన ప్రశ్నించారు. ఈ మ్యాచ్ జరిపేందుకు గల కారణం డబ్బు ఆశ, టీవీ ప్రసార హక్కులు, ప్రకటనల ఆదాయం లేదా ఆటగాళ్ల ఫీజులా? అంటూ బీసీసీఐని సూటిగా ప్రశ్నించారు. ఈ మ్యాచ్‌ను దేశద్రోహమని, సిగ్గులేని చర్య అని అభివర్ణించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. మొత్తం మీద దుబాయ్‌లో జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ క్రీడా ప్రపంచంలోనే కాకుండా భారత రాజకీయాల్లో కూడా తీవ్రమైన చర్చకు దారి తీసింది. మ్యాచ్‌ను దేశభక్తి, సైనికుల త్యాగాల అంశాలతో ముడిపెట్టి కేంద్ర ప్రభుత్వంపై, బీసీసీఐపై విమర్శల దాడికి దిగింది శివసేన యూబీటీ.


