Uddhav Thackeray-Raj Thackeray at One Stage: మహారాష్ట్ర రాజకీయాల్లో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. రెండు దశాబ్దాల అనంతరం రాజకీయ విభేదాల తర్వాత శివసేన (UBT) అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ ఠాక్రే ముంబయిలో జరిగిన ఓ ర్యాలీలో ఒకే వేదికపై ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం భారతదేశ చరిత్రలో ఇదొక సంచలనంగా మారింది.
కారణం ఇదే: కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 5వ తరగతులకు హిందీని తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టింది. దీంతో ఈ నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీనిని మరాఠీల విజయంగా శివసేన, ఎంఎన్‌ఎస్ పార్టీలు సంబరాలు చేసుకున్నాయి. దీని గుర్తుగా నేడు ‘మరాఠీ విక్టరీ ర్యాలీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రెండు పార్టీలకు చెందిన అగ్రనాయకులు ఒకే వేదికను పంచుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే అవిభాజ్య శివసేనను వీడిన తర్వాత 2005లో మాల్వన్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో చివరిసారిగా వీరిద్దరు కనిపించారు. అదే ఏడాది శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్ ఠాక్రే 2006లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్)ను స్థాపించారు. ఆ తర్వాత ఠాక్రే సోదరులు ఒకే వేదికపై బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంటే దాదాపు వీరు రెండు దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్నారు. ఈ ర్యాలీకి ఇరు పార్టీల మద్దతుదారులు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ముఖ్యంగా మహారాష్ట్ర సాంస్కృతిక, విద్యారంగంలో మరాఠీ ప్రాధాన్యాన్ని చాటేందుకు శివసేన(యూబీటీ), ఎంఎన్ఎస్ సంయుక్తంగా ఈ ర్యాలీని నిర్వహించడం ద్వారా ఏకం అయ్యాయనే చెప్పాలి. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడో భాషగా తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ రెండు జీవోలు ఇచ్చింది. అయితే ప్రాంతీయ పార్టీలు, సాంస్కృతిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ?: ఈ నిర్ణయం కాస్త ఇప్పుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఏకం అయ్యేందుకు సహకరించదని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కలయిక కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముంబయి నగరపాలక సంస్థ ఎన్నికలకు ముందు ఇది రెండు పార్టీలకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.
ముందస్తు నిర్ణయం మేరకు ఎంఎన్ఎస్, శివసేన (యూబీటీ) సంయుక్తంగా నిర్వహించిన ఈ ర్యాలీకి ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ హాజరు కాలేదు. ఇదిలావుండగా ఠాక్రే సోదరుల ర్యాలీకి దూరంగా ఉంటున్నట్లు కాంగ్రెస్ అంతర్గత వర్గాలు తెలిపాయి.