Uddhav Thackeray- Raj Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ విభేదాలతో రెండు దశాబ్దాలుగా దూరమైన ఠాక్రే సోదరులు తిరిగి ఒక్కటయ్యారు. ఈ అనూహ్య పరిణామం దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మరాఠీ భాష పరిరక్షణ కోసం ముంబైలో ఏర్పాటుచేసిన భారీ సభలో ఒకే వేదికపై కలిశారు. మహాయుతి ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా విధానాన్ని మరాఠీ మేధావులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ ప్రతిపాదనను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఈ మేరకు ‘మరాఠీ ఐక్యత విజయం’ పేరుతో ఇవాళ ఉదయం భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మరాఠీ రచయితలు, విద్యావేత్తలు, కళాకారులు హాజరయ్యారు. వీరితో పాటు ఠాక్రే సోదరులైన శివసేన(UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) చీఫ్ రాజ్ ఠాక్రే హాజరుకావడం విశేషం. ప్రస్తుతం ఈ ఇద్దరు సోదరులు రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
శివసేన పార్టీ రెండుగా చీలిపోవడం.. ఉద్థవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి కోల్పోవడం వంటివి జరిగిపోయాయి. చివరకు పార్టీ సింబల్ కూడా కోల్పోయారు. ఇక రాజ్ ఠాక్రే కూడా సరైన సపోర్ట్ లేక రాజకీయం వెనకబడ్డారు. దీంతో విడివిడిగా ఉండి పోరాటం కంటే కలిసి ఉండి రాజకీయంగా పోరాడితే భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు. త్వరలో జరగనున్న బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయంగా పొత్తు కుదుర్చుకోవాలని యోచిస్తున్నట్లు రాజకీయ విశ్లేకులు భావిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఇద్దరు సోదరులు ఒకటై తిరిగి గత వైభవాన్ని పొంది బాల్ ఠాక్రే వారసత్వాన్ని నిలబెడతారో లేదో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే సోదరుల కలయికపై మహాయుతి ప్రభుత్వం నేతలు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. వారి రాజకీయ భవిష్యత్తు కోసమే మరాఠీ భాష ఎజెండా ఎత్తుకున్నారని విమర్శిస్తున్నారు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు కోసమే ఇద్దరు ప్రయత్నాలని మండిపడుతున్నారు. ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మరాఠీలు మహారాష్ట్ర విడిచి వలస వెళ్లారంటూ ఆరోపిస్తున్నారు. మొత్తానికి సోదరుల కలయికతో మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.