Deeksha Breaks 170hr Bharatnatyam world record: కర్ణాటకలోని మంగళూరుకు చెందిన భరతనాట్య కళాకారిణి విదుషి దీక్ష భరతనాట్యంలో రికార్డు సృష్టించింది. దాదాపు, 170 గంటలకు పైగా నిరంతరాయంగా భరతనాట్యం (Bharatanatyam) చేసి.. ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం దక్కించుకుంది. ఆగస్టు 21 మధ్యాహ్నం 3.30 గంటలకు నాట్యం ప్రారంభించిన దీక్ష ఇప్పటికే 170 గంటలు పూర్తి చేయగా.. మొత్తం 216 గంటల పాటు నాట్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రంతో ఆ రికార్డును చేరుకొనే అవకాశం ఉంది. ఇకపోతే, రత్న సంజీవ కళామండలి ఆధ్వర్యంలో విదుషి దీక్ష భరతనాట్య ప్రదర్శన ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆసియా హెడ్ డాక్టర్ మనీష్ విష్ణోయ్ మాట్లాడుతూ.. విదుషి దీక్ష అసాధారణ ప్రతిభను, పట్టుదలను అభినందించారు. చిన్న గ్రామం, సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పట్టుదలతో ప్రపంచ రికార్డు సాధించడం గొప్ప విషయమన్నారు. 216 గంటల పాటు నాట్యం చేయాలనే లక్ష్యంతో ఆమె ఇంకా నృత్యాన్ని కొనసాగిస్తోందన్నారు. కాగా.. ఇటీవల కర్ణాటకకు చెందిన రెమోనా (Remona) 170 గంటల పాటు భరతనాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ప్రస్తుతం విదుషి దీక్ష, రెమోనా రికార్డ్‌ను అధిగమించింది.


