Aadhaar : మీరు ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిందా..? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆధార్ అప్‌డేట్ చేయలేదా..? అయితే వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) సూచించింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా కానీ లేదా సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. అంటే మీ గుర్తింపు వివరాలు మారినా, మీ చిరునామా మారినా, మీ ఫోన్ నెంబర్ మారినా, మరే ఇతర వివరాలు మారిన సంబంధిత డాక్యుమెంట్లతో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం మన నిత్య జీవితంలో ఆధార్ కార్డు తప్పని సరిగా మారిన సంగతి తెలిసిందే. పరీక్షలు రాయాలన్నా, ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలన్నా, బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేయాలన్నా, వేరే దేశంలో ప్రయాణించాలి అనుకున్నా, ఆఖరికి చిన్న పిల్లలను స్కూల్స్‌లో చేర్పించాలన్నా కానీ ఆధార్ తప్పనిసరి అయ్యింది. ఆధార్ లేకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సేవలు దాదాపుగా పొందలేకపోతున్నారు. ఆఖరికి బ్యాంకులు కూడా వ్యక్తికి ఆధార్ లేకుంటే రుణాలు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి.
319 కేంద్ర ప్రభుత్వ పథకాలు సహా దాదాపు 1100 ప్రభుత్వ పథకాలకు ఆధారే ఆధారం. ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 134 కోట్ల ఆధార్ నంబర్లు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉంటున్న చిరునామాతో ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ కోరింది.