Volodymyr Zelensky: ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘టైమ్స్’ సంస్థ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీని ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్–2022’గా ఎంపిక చేసింది. ఈ మేరకు జెలెన్‌స్కీ ముఖచిత్రంతో తాజా సంచిక విడుదల చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో జెలెన్‌స్కీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది.
రష్యాలాంటి అగ్ర దేశందాడిని ఎదుర్కోవడంలో ఆయన ధైర్య సాహసాలు ప్రదర్శించాడని, ఉక్రెయిన్‌ను ముందుకు నడిపించాడని ‘టైమ్స్’ పేర్కొంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నప్పటికీ ఆయన ఆ ప్రదేశం విడిచి వెళ్లలేదని టైమ్స్ ప్రస్తావించింది. జెలెన్‌స్కీ తన చర్యల ద్వారా ఉక్రెయిన్ ప్రజల్లో స్ఫూర్తి నింపాడని, ప్రపంచం మనసు గెలుచుకున్నాడని ‘టైమ్స్’ వ్యాఖ్యానించింది.
గతంలో పలువురు అధ్యక్షులు యుద్ధాలు, తిరుగుబాటు సందర్భంగా దేశం విడిచి వెళ్లిపోయారని టైమ్స్ గుర్తు చేసింది. గత ఏడాది తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ స్వాధీనం చేసుకున్న సమయంలో ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, ఎనిమిదేళ్ల క్రితం ఉక్రెయిన్‌లో ప్రజలు తిరుగుబాటు చేసిన సమయంలో అప్పటి అధ్యక్షుడు విక్టోర్ యనుకోవిచ్ వంటి పలువురు దేశాధినేతలు తమ మాతృ దేశాన్ని విడిచివెళ్లారని, కానీ, జెలెన్‌స్కీ మాత్రం క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ విడిచిపెట్టలేదని ప్రశంసించింది. రష్యా దాడి ఇంకా కొనసాగుతున్నప్పటికీ జెలెన్‌స్కీ సైనికులను కలుసుకుంటూ వాళ్లలో స్ఫూర్తి నింపుతున్నాడు. కాగా, గత ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు టెస్లా సీఈవో ఎలన్ మస్క్.