Unclaimed financial assets in India banks : లక్షల కోట్లు లాకర్లలో కాదు… బ్యాంకుల్లో అనాథలుగా పడి ఉన్నాయి! కంటికి రెప్పలా దాచుకున్న సొమ్ము, కాసుల కూడబెట్టుకున్న పొదుపు… ఇప్పుడు యజమానుల జాడ లేక, వారసుల ఆచూకీ దొరకక బ్యాంకు ఖాతాల్లోనే మగ్గిపోతోంది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన తాజా అధికారిక గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశంలో ఎవరూ క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల విలువ అక్షరాలా రూ.1.1 లక్షల కోట్లకు చేరింది. ‘మీ డబ్బు-మీ హక్కు’ అంటూ రిజర్వ్ బ్యాంక్ (RBI), సెబీ (SEBI) వంటి నియంత్రణ సంస్థలు ఊరూరా అవగాహన కల్పిస్తున్నా, ‘ఉద్గమ్’ (UDGAM) వంటి వెబ్‌సైట్లను తీసుకొచ్చినా ఆశించిన ఫలితం దక్కడం లేదు.
నిధుల నిట్టూర్పు.. ఎక్కడ ఎంతెంత సొమ్ము : దేశంలో పేరుకుపోయిన ఈ రూ.1.1 లక్షల కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను పరిశీలిస్తే, సింహభాగం మన రోజువారీ బ్యాంకింగ్ వ్యవస్థలోనే ఉండిపోయింది.
వివిధ బ్యాంకులు: అత్యధికంగా రూ.83,000 కోట్లు రకరకాల బ్యాంకు ఖాతాల్లో (పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు) మగ్గుతున్నాయి.
లైఫ్ ఇన్సూరెన్స్: జీవిత బీమా పాలసీల రూపంలో రూ.14,000 కోట్లు క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయాయి.
ఈక్విటీ మార్కెట్లు: షేర్లు, డివిడెండ్ల రూపంలో మరో రూ.10,000 కోట్లు ఈక్విటీ పెట్టుబడులుగా నిలిచిపోయాయి.
ప్రస్తుతం ఈ నిధులు సురక్షితంగానే ఉన్నప్పటికీ, అవి ప్రజలకు చేరడం లేదు. ఆర్‌బీఐ తన పరిధిలోని నిధులను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (DEAF) లో ఉంచగా, సెబీ తన పరిధిలోని ఈక్విటీ నిధులను ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (IPEF) కు బదిలీ చేసింది.
అసలు సమస్య ఎక్కడ? మారిన పాత రికార్డులు ఖాతాదారులకు, వారసులకు హక్కు ఉన్నా ఈ సొమ్మును అందుకోలేకపోవడానికి ప్రధాన కారణం సాంకేతిక లోపాలు, పాత పద్ధతులే.
‘చేతిరాత’ ఖాతాల చిక్కులు : ఈ సమస్య ప్రధానంగా పాన్, ఆధార్ కార్డ్‌ల అనుసంధానానికి ముందు, కేవైసీ (KYC) ప్రక్రియ డిజిటలైజ్ కాకముందు నాటిది. అప్పట్లో చేతిరాతతో రాసిన అకౌంట్లలో పేర్ల స్పెల్లింగులు తప్పుగా పడటం, తాత్కాలిక చిరునామాలు ఇవ్వడం వల్ల ఇప్పుడు డిజిటల్ రికార్డులతో అవి సరిపోలడం లేదు.
నామినీ వివరాలు లేకపోవడం : చాలా పాత ఖాతాలకు నామినేషన్ సౌకర్యం సరిగా ఉపయోగించుకోలేదు. అసలైన ఖాతాదారుడు మరణించిన తర్వాత, వారి వారసులు ఆఫీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది.
వయసు పైబడటం – సంతకాలు మారడం : ఇంకొక జఠిలమైన సమస్య ఏమిటంటే.. అసలైన ఖాతాదారులు బతికే ఉన్నా, వయసు పైబడటం వల్ల వారి సంతకాలు మారడం, వేలిముద్రలు సరిగా పడకపోవడం, మతిమరుపు లేదా నరాల బలహీనత వంటి కారణాల వల్ల వారు తమ స్వంత డబ్బును కూడా విత్‌డ్రా చేసుకోలేకపోతున్నారు.
పరిష్కారాలు ఉన్నా.. ఆశించిన ఫలితం శూన్యం : ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్నో వెసులుబాట్లను కల్పించింది. ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన ఉద్గమ్ (UDGAM – Unclaimed Deposits Gateway to Access Information) పోర్టల్ ద్వారా ప్రజలు తమ క్లెయిమ్ చేయని డిపాజిట్లను సులభంగా వెతుక్కునే అవకాశం కల్పించారు.
గత ఏడాది ఆర్‌బీఐ, సెబీ సంయుక్తంగా చేపట్టిన ‘మీ డబ్బు-మీ హక్కు’ ప్రచార కార్యక్రమం ద్వారా సుమారు రూ.5,777 కోట్ల విలువైన ఆస్తులను లబ్ధిదారులకు విజయవంతంగా తిరిగి అప్పగించారు. అయినప్పటికీ, ఇంకా లక్ష కోట్లకు పైగా నిధులు బ్యాంకుల్లోనే మూలుగుతుండటం గమనార్హం. వారసులకు అర్హత ఉన్నప్పటికీ రకరకాల అఫిడవిట్లు, ఇండెమ్నిటీ బాండ్లు సమర్పించడం వారికి ‘పెనుభారం’గా మారుతోందని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

