Wednesday, February 18, 2026
HomeTop StoriesBudget 2026: నిర్మలమ్మ వైద్యం.. 5 మెడికల్ హబ్‌లు.. లక్ష ఏహెచ్‌పీలతో సరికొత్త ఆయువు

Budget 2026: నిర్మలమ్మ వైద్యం.. 5 మెడికల్ హబ్‌లు.. లక్ష ఏహెచ్‌పీలతో సరికొత్త ఆయువు

Healthcare infrastructure development in India budget 2026 : “ఆరోగ్యమే మహాభాగ్యం” అన్నది ఆర్యోక్తి. ఒక దేశం ఆర్థికంగా పరిపుష్టం కావాలంటే, ఆ దేశ పౌరులు శారీరకంగా, మానసిక ఆరోగ్యంతో ఉండటం అత్యంత అవశ్యం. ఈ పరమార్థాన్ని తలకెత్తుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2026-27 బడ్జెట్‌లో వైద్య రంగానికి సరికొత్త హంగులు అద్దారు. కేవలం ఆసుపత్రుల నిర్మాణంతో సరిపెట్టకుండా, ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేలా ‘మెడికల్ టూరిజం’కు పెద్దపీట వేశారు. మరోవైపు, వైద్య రంగానికి వెన్నెముకగా నిలిచే నైపుణ్యం కలిగిన మానవ వనరుల సృష్టికి భారీ ప్రణాళికను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

- Advertisement -

వైద్య రంగ ప్రక్షాళన: నిర్మలమ్మ వ్యూహం  :  కేంద్ర బడ్జెట్ 2026లో ఆరోగ్య రంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి వెల్లడించిన కీలక అంశాలు
ఏహెచ్‌పీల విప్లవం – లక్ష మందికి ఉపాధి: వైద్య రంగంలో కేవలం డాక్టర్లు ఉంటే సరిపోదు, వారికి తోడుగా ఉండే పారామెడికల్ సిబ్బంది లేదా ‘అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్’ (AHPs) పాత్ర అత్యంత కీలకం. “ముందు చూపే మేలైన ఆయుధం” అన్నట్లుగా, భవిష్యత్తు అవసరాల కోసం ఏకంగా లక్ష మంది ఏహెచ్‌పీలను సిద్ధం చేసేలా ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియోగ్రాఫర్లు, థెరపిస్టుల వంటి రంగాల్లో నిపుణులను తయారు చేయడం ద్వారా ఆసుపత్రుల్లో సేవల నాణ్యత పెరగడమే కాకుండా యువతకు ఉపాధి లభిస్తుంది.

గ్లోబల్ మ్యాప్‌లో భారత్ – 5 మెడికల్ హబ్‌లు: భారతదేశ వైద్య సేవలు ప్రపంచంలోనే చౌకగా, నాణ్యంగా లభిస్తాయన్నది జగమెరిగిన సత్యం. దీనిని మరింత వ్యవస్థీకృతం చేసేందుకు దేశవ్యాప్తంగా 5 మెడికల్ టూరిజం హబ్‌ల ఏర్పాటుకు కేంద్రం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. విదేశీ రోగులను ఆకర్షించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంతో పాటు, మన దేశాన్ని అంతర్జాతీయ వైద్య గమ్యస్థానంగా నిలబెట్టడం దీని ప్రధాన లక్ష్యం.

ఆయుర్వేదానికి పట్టాభిషేకం: మన ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఆయుర్వేద ఉత్పత్తుల ఎగుమతుల కోసం ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్ని తెచ్చారు. దేశంలో మూడు కొత్త ఆయుర్వేద అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రత్యేకంగా ‘ఆయుర్వేద ఔషధ అభివృద్ధి సంస్థ’ను నెలకొల్పి, పరిశోధనలకు పెద్దపీట వేయనున్నారు.

వికసిత్ భారత్ దిశగా ఆరోగ్య అడుగులు : ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ బడ్జెట్ నిర్ణయాలు “మూడు పువ్వులు ఆరు కాయలు”గా ఆరోగ్య రంగాన్ని వృద్ధి చేస్తాయి. ముఖ్యంగా వైద్య అనుబంధ రంగాలపై దృష్టి పెట్టడం వల్ల ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గి, రోగులకు త్వరితగతిన చికిత్స అందుతుంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News