Longest Serving Indian Finance Minister record : భారత ఆర్థిక రంగాన్ని శాసించే అక్షరాల అమ్ములపొది సిద్ధమైంది. రేపు సూర్యోదయంతో పార్లమెంట్ సాక్షిగా అంకెలే అక్షరాలై.. దేశ భవిష్యత్తును ఆవిష్కరించనున్నాయి. ఈ బడ్జెట్ ప్రసంగం కేవలం ఒక వార్షిక లెక్కల పత్రం మాత్రమే కాదు.. ఒక అరుదైన రికార్డుల ప్రస్థానం! స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఎందరో ఆర్థిక మాంత్రికులు ఈ పీఠాన్ని అలంకరించారు. కానీ, సంక్షోభాలను సుసాధ్యం చేస్తూ, వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్ తన పేరును చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకోబోతున్నారు.
రికార్డుల హోరు: దిగ్గజాల రికార్డులు కనుమరుగు : ఆదివారం, నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే, ఒక సరికొత్త రికార్డు నమోదవుతుంది.
వరుసగా 9వ సారి – ఇది అసాధారణం : భారత పార్లమెంటరీ చరిత్రలో ఏ ఆర్థిక మంత్రి కూడా వరుసగా తొమ్మిదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు, మన్మోహన్ సింగ్ 5 సార్లు, అరుణ్ జైట్లీ 5 సార్లు ఈ ఘనత సాధించారు. రేపటి ప్రసంగంతో నిర్మలమ్మ వీరినందరినీ దాటేసి అగ్రస్థానంలో నిలవనున్నారు. మొత్తం బడ్జెట్‌ల సంఖ్య పరంగా చూసినా, పి.చిదంబరం (9 సార్లు) రికార్డును ఆమె సమం చేయనున్నారు. ఇక ఆమె ముందున్నది కేవలం మొరార్జీ దేశాయ్ (మొత్తం 10 సార్లు) రికార్డు మాత్రమే.
నిరంతరాయంగా సుదీర్ఘ కాలం: కేవలం బడ్జెట్‌ల సంఖ్యలోనే కాదు, ఆర్థిక మంత్రిగా అత్యధిక కాలం నిరంతరాయంగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. 2019 మే 31 నుంచి నేటి వరకు (సుమారు 6 ఏళ్ల 8 నెలలు) ఆమె ఈ పదవిలో కొనసాగుతున్నారు. గతంలో సి.డి. దేశ్‌ముఖ్ (6 ఏళ్ల 2 నెలలు) పేరిట ఉన్న రికార్డును ఆమె ఎప్పుడో అధిగమించారు.
సవాళ్లను సైతం సానుకూలంగా మార్చి : నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ “ముందు నుయ్యి వెనుక గొయ్యి” అన్న చందంగా ఉన్న అనేక అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంది. కొవిడ్-19 వంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసినా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినా.. భారత ఆర్థిక నావను ఆమె సురక్షితంగా నడిపించారు. ఆమె హయాంలోనే భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. తన ఆర్థిక క్రమశిక్షణతో దేశాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిపారు.
సంప్రదాయాలకు స్వస్తి.. ఆధునికతకు అడుగులు : బడ్జెట్ ప్రవేశపెట్టే శైలిలోనూ ఆమె విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
బహీ ఖాతా: బ్రిటీష్ కాలం నాటి ‘బ్రీఫ్‌కేస్’ సంప్రదాయానికి స్వస్తి పలికి, భారతీయ మూలాలున్న ఎర్రటి వస్త్రంతో కూడిన ‘బహీ ఖాతా’ను పరిచయం చేశారు.
డిజిటల్ బడ్జెట్: 2021 నుంచి పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ‘ట్యాబ్లెట్’ ద్వారా ప్రసంగం చదువుతున్నారు.
సుదీర్ఘ ప్రసంగం: 2020లో ఆమె చేసిన 2 గంటల 40 నిమిషాల ప్రసంగం ఇప్పటికీ ఒక రికార్డు.

