Union Cabinet meeting decisions taken on defense matters: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. రక్షణ వ్యవహారాలపై కేబినెట్ కీలకంగా చర్చించింది. ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం, కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణలు, వాటి వల్ల కలిగే భద్రతాపరమైన పరిణామాలు, దేశ ఎగుమతులు, దిగుమతుల్లో ఏర్పడే అంతరాయాలు, విదేశాల్లోని భారతీయ పౌరుల భద్రత, నావికుల రక్షణ గురించి ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇక, భారత్‌కు చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో భారత్‌కు సరకు రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలపై ప్రధాని కేబినెట్ మంత్రులను ఆరా తీసినట్లు సమాచారం. నల్ల సముద్రం, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మార్గాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవడంపైనా కేబినెట్‌లో చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పెట్రోలియం, సహజవాయువు, ఎరువులు తదితరాల దిగుమతికి తీసుకుంటున్న చర్యలపై ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుత, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, భారత్‌పై వాటి ప్రభావం, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపైనా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Gachibowli: గచ్చిబౌలిలో భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం.. ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలు

