No Toll Fee for Two-Wheelers on National Highways : జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు జులై 15, 2025 నుంచి టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ విషయంపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కూడా సమానమైన వివరణ ఇచ్చింది.
ద్విచక్ర వాహనాలకు టోల్ ఛార్జీల మినహాయింపు యథావిధిగా కొనసాగుతుందని, ఇలాంటి ఫీజు విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని గడ్కరీ తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియా వేదికలు ద్విచక్ర వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఫాస్టాగ్ విధానం తప్పనిసరి చేయబడుతుందని తప్పుడు వార్తలను వ్యాప్తి చేశాయి. ఈ ప్రచారంలో నిజం లేదని, ప్రజలను అయోమయానికి గురిచేసే ఇటువంటి నిరాధార వార్తలను వ్యాప్తి చేయడం ఆరోగ్యకరమైన జర్నలిజం కాదని గడ్కరీ విమర్శించారు. NHAI కూడా ఈ వార్తలను ఫేక్ న్యూస్‌గా పేర్కొంటూ, ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు విధించే ప్రణాళికలు ఏవీ లేవని స్పష్టం చేసింది.
ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్: ద్విచక్ర వాహనాలపై టోల్ ఫీజు వార్తలను ఖండిస్తూనే, కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పాస్ ధర రూ.3,000గా నిర్ణయించారు. ఇది ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విధానం కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర (నాన్-కమర్షియల్) ప్రైవేటు వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.
ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు లేదా గరిష్ఠంగా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే, అప్పటితో పాస్ గడువు ముగిస్తుంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఈ పాస్ ఉపయోగపడుతుంది, రాష్ట్ర రహదారులపై వర్తించదు. ఈ పాస్ యాక్టివేషన్ కోసం రాజ్‌మార్గ్ యాత్రా యాప్‌తో పాటు NHAI, MoRTH అధికారిక వెబ్‌సైట్లలో త్వరలో ఒక లింక్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చడం లక్ష్యం : ఈ వార్షిక పాస్ విధానం జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే వాహనదారులకు రద్దీని తగ్గించడం, టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని ఆదా చేయడం, ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా టోల్ రుసుములకు సంబంధించిన వివాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధానం లక్షలాది ప్రైవేటు వాహన యజమానులకు సరసమైన ధరలో సురక్షితమైనా సులభమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది : ఈ వార్షిక పాస్ కేవలం వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ వాహనదారులు ఈ పాస్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తే, ముందస్తు సమాచారం లేకుండా డీయాక్టివేట్ చేయబడుతుందని కేంద్రం హెచ్చరించింది. అలాగే, ఈ పాస్ జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న టోల్ ప్లాజాలకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.