Shivraj singh On Preamble: భారత రాజ్యాంగం మూల స్తంభాలుగా పరిగణించబడే ‘లౌకిక’ ‘సామ్యవాద’ పదాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 27, 2025న వారణాసిలో అత్యవసర పరిస్థితి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “సామ్యవాదం భారత్‌కు అవసరం లేదు. లౌకికవాదం మన సంస్కృతికి మూలం కాదు” అని స్పష్టం చేశారు. మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. భారత రాజ్యాంగం మూలసూత్రాలైన ఈ రెండు పదాలను తొలగించాలన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పిలుపునకు చౌహాన్ మద్దతు పలకడం వివాదాస్పదంగా మారింది.
కేంద్ర మంత్రి చౌహాన్ వాదన:
వారణాసిలో జరిగిన అత్యవసర పరిస్థితి (1975–1977) 50 ఏళ్ల కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడుతూ, “సామ్యవాదం భారత్‌కు అవసరం లేదు. లౌకికవాదం మన సంస్కృతి మూలం కాదు” అని స్పష్టం చేశారు. భారతదేశానికి ‘సర్వ ధర్మ సంభవ్’, ‘వసుధైవ కుటుంబకం’ వంటి సనాతన సూత్రాలే నిజమైన గుర్తింపునిస్తాయని, లౌకికవాదం పాశ్చాత్య భావన అని వాదించారు.
ఈ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలె ‘లౌకిక’, ‘సామ్యవాద’ పదాలను సమీక్షించాలని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ పదాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన అసలు రాజ్యాంగంలో లేవని, ఎమర్జెన్సీ సమయంలో చేర్చారని హొసబలె పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ కాలంలో చేసిన తప్పులకు దేశానికి క్షమాపణ చెప్పాలి:
అదే సందర్భంలో, చౌహాన్ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శించారు. కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే నియంతృత్వం ఉందని, రాజ్యాంగాన్ని చేతపట్టుకుని తిరిగే కాంగ్రెస్ నేతలు ఎమర్జెన్సీ కాలంలో చేసిన తప్పులకు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం ప్రధాని మోదీ నుంచి నేర్చుకోవాలని సూచించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయాన్ని మోదీ ప్రారంభించారని గుర్తు చేశారు.
42వ రాజ్యాంగ సవరణ ద్వారా:
ఎమర్జెన్సీ, పదాల చేరిక నేపథ్యం: 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో పౌర హక్కులు అణచివేయబడి, విపక్ష నాయకులు జైలుపాలయ్యారు. ఈ కాలంలోనే, 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘లౌకిక’, ‘సామ్యవాద’, ‘సమగ్రత’ పదాలు రాజ్యాంగ పీఠికలో చేర్చబడ్డాయి. చౌహాన్ తన గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ, తాను 16 ఏళ్ల వయసులో డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ కింద జైలుకు వెళ్లానని, తుర్క్‌మాన్ గేట్‌లో బుల్డోజర్ దాడులు వేలాది మందిని నిరాశ్రయులను చేశాయని ప్రస్తావించారు.
అంబేద్కర్ ఆలోచనలు, సుప్రీంకోర్టు తీర్పు:
డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 1948లో ‘లౌకిక’, ‘సామ్యవాద’ పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చడాన్ని వ్యతిరేకించారు. రాజ్యాంగం ఒక నిర్దిష్ట భావజాలానికి కట్టుబడి ఉండకూడదని, సామ్యవాద సూత్రాలు ఇప్పటికే డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ (DPSP) రూపంలో ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, ఇటీవల 2024లో సుప్రీంకోర్ట్ (డాక్టర్ బలరాం సింగ్ vs యూనియన్ ఆఫ్ ఇండియ కేసులో) 42వ సవరణను సమర్థించింది. భారతీయ లౌకికవాదం అంటే ‘సమ ధర్మ గౌరవం’ అని, సామ్యవాదం అంటే ‘సంక్షేమ రాజ్యం’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ రెండు పదాలు రాజ్యాంగం ‘బేసిక్ స్ట్రక్చర్’లో అంతర్భాగమని కోర్టు తీర్పునిచ్చింది.