Man Carries Daughter In Arms As Ambulance Gets Stuck: అది ఓ రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతం. ఎటుచూసినా వాహనాలే. ఆ ట్రాఫిక్ జామ్‌లో ఓ అంబులెన్స్ సైరన్ మోగుతున్నా కదలలేని పరిస్థితి. అంబులెన్స్‌లో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న 20 ఏళ్ల కూతురు. ఆమె ఆరోగ్యం క్షణక్షణం విషమిస్తోంది. ఆ తండ్రి గుండె ఆగిపోయినంత పనైంది. ఇంక లాభం లేదనుకున్నాడు. అంబులెన్స్ దిగి, కూతురిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వాహనాల మధ్య సందుల నుంచి దారి చేసుకుంటూ ఆసుపత్రి వైపు పరుగెత్తాడు.
ALSO READ: Blackmail: అమ్మాయిల నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్.. 2021లో బెయిల్‌పై తప్పించుకున్న నిందితుడి అరెస్ట్!
ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ తండ్రి నిస్సహాయతకు చలించిపోతున్నారు.
వివరాల్లోకి వెళితే.. దేవరియా జిల్లా, సలేంపూర్ నివాసి అయిన స్వామినాథ్, తన 20 ఏళ్ల కుమార్తె పింకీ కుమారి ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి బయల్దేరాడు. మార్గమధ్యంలో, స్థానిక మార్కెట్ వద్ద వారు ప్రయాణిస్తున్న అంబులెన్స్ భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయింది.
కూతురి పరిస్థితి మరింత దిగజారుతుండటంతో స్వామినాథ్ తన సహనాన్ని కోల్పోయాడు. ఇక అంబులెన్స్‌లో వేచి చూస్తే ప్రమాదమని భావించి, కుమార్తెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు.
వీడియోలో, స్వామినాథ్ తన కూతురిని ఎత్తుకుని వాహనాల మధ్య ఉన్న చిన్న గ్యాప్‌ల నుండి వేగంగా నడుచుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. మరో వ్యక్తి అతనికి దారి చూపిస్తూ, వాహనదారులను పక్కకు జరగమని కోరుతూ ముందుకు వెళ్తున్నాడు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.
కొంత దూరం నడిచిన తర్వాత, ట్రాఫిక్ జామ్ దాటిన ప్రాంతంలో స్వామినాథ్‌కు ఒక ఆటోరిక్షా లభించింది. దాని సహాయంతో అతను తన కుమార్తెను ఆసుపత్రికి చేర్చగలిగాడు. ఈ ప్రాంతంలో స్థానిక వ్యాపారులు తమ వాహనాలను అస్తవ్యస్తంగా, అడ్డగోలుగా పార్క్ చేయడం వల్లే తరచూ ఇలాంటి భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని, దీనివల్ల అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.


