UP voter list controversy : “అధికారం చేజారుతుందన్న భయంతో, బీజేపీ ఓ కొత్త మిషన్‌కు తెరలేపింది. అదే ‘దొంగ ఓట్ల మిషన్’ అంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఏకంగా 2.89 కోట్ల ఓట్లను తొలగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ అయిన ఆ స్థానాల్లో, తమకు అనుకూలమైన బోగస్ ఓట్లను చేర్పించేందుకు, సాక్షాత్తు ముఖ్యమంత్రే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియలో, రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 15.44 కోట్ల నుంచి 12.55 కోట్లకు పడిపోయింది. అంటే, సుమారు 2.89 కోట్ల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి.
అఖిలేష్ ఆరోపణలు : లక్నోలో నిర్వహించిన మీడియా సమావేశంలో అఖిలేష్ యాదవ్, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. “దాదాపు 3 కోట్ల ఓట్లు తగ్గిపోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే, అధికారులను పిలిపించుకుని, ఎలాగైనా సరే ఓటర్ల సంఖ్యను పెంచాలని బెదిరిస్తున్నారు,” అని అఖిలేష్ ఆరోపించారు.
‘పీడీఏ ప్రహరీ’తో నిఘా: “బీజేపీ కుట్రలను అడ్డుకోవడానికి, మా పార్టీకి చెందిన ‘పీడీఏ ప్రహరీ’ బృందాలు డేగకన్నుతో నిఘా ఉంచుతాయి. దొంగ ఓట్లు చేర్పించే బీజేపీ నేతలపై, అధికారులపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం,” అని ఆయన హెచ్చరించారు. ప్రజలందరూ వెంటనే తమ బూత్ స్థాయికి వెళ్లి, ముసాయిదా జాబితాలో తమ పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈసీ వివరణ.. మూడు కారణాలు : అయితే, ఇంత భారీగా ఓట్లు తొలగిపోవడానికి గల కారణాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46.23 లక్షల మంది ఓటర్లు మరణించారు. వారి పేర్లను తొలగించారు. దాదాపు 2.17 కోట్ల మంది ఓటర్లు ఇళ్లు మారారు లేదా ఉపాధి కోసం శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. సర్వే సమయంలో వారు ఆ చిరునామాలో లేకపోవడంతో, వారి పేర్లను తొలగించారు. సుమారు 25.47 లక్షల మంది పేర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉన్నాయి. ఈ డూప్లికేట్ ఓట్లను ఏరివేశారు.
మళ్లీ అవకాశం ఉంది
జాబితాలో పేర్లు గల్లంతైన వారికి, కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. జనవరి 6, 2026 నుంచి ఫిబ్రవరి 6, 2026 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 27న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.

