Uttar Pradesh boat capsize incident: కౌడియాల నది కెరటాలు ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపాయి. బతుకు పయనం కోసం పడవెక్కిన వారి జీవితాలు నట్టేట మునిగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మహిళలు, చిన్నారులతో సహా 24 మంది గల్లంతయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న పడవ నదిలో బోల్తా పడటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. చీకటి, దట్టమైన అడవి, ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది.. సహాయక చర్యలకు పెను సవాళ్లు విసురుతున్నాయి. అసలు ఆ పడవ ప్రయాణం ఎందుకు మృత్యు యాత్రగా మారింది? ఆ మారుమూల గ్రామస్థుల బతుకు పోరాటం ఎలాంటిది?
ఇదీ జరిగింది : లఖింపూర్ జిల్లా ఖైరతియా గ్రామానికి చెందిన సుమారు 28 మంది, బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో పడవలో పొరుగునే ఉన్న భరత్‌పూర్‌కు బయలుదేరారు. బహ్రైచ్ జిల్లా పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న భరత్‌పూర్ సమీపంలోకి రాగానే, కౌడియాల నదిలో వారి పడవ అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం, నీటి ప్రవాహం అత్యంత బలంగా ఉండటమే ఈ ఘోర ప్రమాదానికి కారణం. పడవ బోల్తా పడగానే, అందులో ఉన్నవారిలో లక్ష్మీ నారాయణ్, రాణి దేవి, జ్యోతి, హరిమోహన్ అనే నలుగురు మాత్రమే ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. మిగిలిన 24 మంది నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలియడంతో ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నంటాయి.
చీకటిలో సహాయక చర్యలు : విషయం తెలుసుకున్న వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, జిల్లా అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, రాత్రి సమయం కావడం, ఆ ప్రాంతంలో కనీస వెలుతురు కూడా లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పడవలే వారికి ఆధారం : ప్రమాదం జరిగిన భరత్‌పూర్ గ్రామం కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం లోపల ఉంది. ఈ గ్రామానికి మూడు వైపులా నదే ప్రవహిస్తుండగా, సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో అక్కడి ప్రజలు తమ నిత్యావసరాలకు, ప్రయాణాలకు పూర్తిగా పడవలపైనే ఆధారపడతారు. ఈ ప్రాంతానికి చేరుకోవడం అత్యంత కష్టమని, ఇక్కడ అడవి ఏనుగుల సంచారం కూడా అధికంగా ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ భౌగోళిక పరిస్థితులు సైతం సహాయక బృందాలకు పెను సవాలుగా మారాయి. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది.


