Uttarakhand cloudburst News: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో సంభవించిన మేఘ విస్ఫోటం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. బాసుకేదర్ తహసీల్‌లోని బరేత్ దుంగర్ టోక్, చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతాల్లో ఈ విపత్తు చోటుచేసుకుంది. కుండపోత వర్షాలతో అలకనంద, మందాకిని నదులు ఉప్పొంగి, గ్రామాలను ముంచెత్తాయి. ఈ వరదల్లో ఇళ్లు, వంతెనలు కూలిపోగా, 180కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. కేదార్‌నాథ్ లోయలోని లారా గ్రామానికి సంబంధాలు నిలిచిపోయాయి.
ALSO READ : Bihar : మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కార్యకర్త అరెస్టు
మోపాటా ప్రాంతంలో ఇద్దరు వరదల్లో కొట్టుకుపోగా, 15-20 పశువులు కొట్టంలో చిక్కుకుని మృత్యువాతపడ్డాయి. హనుమాన్ ఆలయం వరద నీటిలో మునిగిపోయింది. అనేక కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకున్నాయని, ఇద్దరు గల్లంతయ్యారని చమోలి జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు బాధితులను కాపాడేందుకు శ్రమిస్తున్నాయి.
ALSO READ : Vijay Thalapathy: పరువు హత్యలపై ‘దళపతి’ పోరాటం.. సుప్రీంకోర్టుకెక్కిన విజయ్ పార్టీ!
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేస్తూ, అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్, చమోలి, బాగేశ్వర్, హరిద్వార్ జిల్లాల్లో స్కూళ్లు, ఆంగన్‌వాడీ కేంద్రాలు మూసివేశారు. భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, మరింత తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్‌ను ఉపయోగిస్తున్నారు.
ఈ విపత్తు హిమాలయ ప్రాంతంలో వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను మరోసారి గుర్తుచేసింది. నిపుణులు మెరుగైన విపత్తు నిర్వహణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల అవసరాన్ని నొక్కిచెప్పారు.


