Uttarakhand flood disaster : ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన దేవభూమి ఉత్తరాఖండ్‌ను వరుణ దేవుడు ముంచెత్తుతున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండలు పెళ్లల్లా విరిగిపడుతున్నాయి. నదులు ఉగ్రరూపం దాల్చి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ ప్రకృతి బీభత్సానికి కేదార్‌నాథ్ సమీపంలో ఇద్దరు యాత్రికులు బలికాగా, పవిత్ర చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.
కొండచరియల రూపంలో మృత్యువు : సోమవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో కేదార్‌నాథ్ జాతీయ రహదారిపై, సోన్‌ప్రయాగ్-గౌరికుండ్ మధ్య ఉన్న ముంకటియా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న వాహనంపై అకస్మాత్తుగా కొండపై నుంచి భారీ బండరాళ్లు, మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఉత్తరకాశీకి చెందిన రీటా (30), చంద్ర సింగ్ (68) అనే ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారని, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్‌వర్ తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
యాత్రలకు తాత్కాలిక విరామం : రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా, ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, చార్‌ధామ్ (బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి) యాత్రతో పాటు హేమకుండ్ సాహిబ్ యాత్రను కూడా సెప్టెంబర్ 5వ తేదీ వరకు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ప్రకటించారు. వాతావరణం మెరుగుపడి, రహదారులు సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే యాత్రలను పునఃప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఎక్కడికక్కడ స్తంభించిన రవాణా : భారీ వర్షాలు, కొండచరియల కారణంగా రాష్ట్రంలోని రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. 8 జాతీయ రహదారులతో సహా మొత్తం 314 రోడ్లు వాహనాల రాకపోకలకు పూర్తిగా మూసుకుపోయాయని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. దీంతో అనేక ప్రాంతాలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. ఐటీబీపీ, ఎస్‌డీఆర్‌ఎఫ్, సైన్యం, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ప్రమాదస్థాయిని దాటిన నదులు.. రెడ్ అలర్ట్ : కేంద్ర జల సంఘం హెచ్చరికల ప్రకారం, రాష్ట్రంలోని యమున, కమ్లా, అలకనంద, మందాకిని, గంగా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. హరిద్వార్, రిషికేశ్‌లలో గంగా నది ఉగ్రరూపంతో ప్రవహిస్తుండటంతో, నదీ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ రాష్ట్రంలోని నైనిటాల్, పౌరి, తెహ్రీ సహా అనేక జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసి, పాఠశాలలకు వరుసగా రెండో రోజు సెలవులు ప్రకటించింది.


