North India floods : ప్రకృతి ప్రకోపానికి హిమాలయ రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు ఉగ్రరూపం దాల్చి, కొండచరియలు విరిగిపడుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి. పవిత్ర కైలాష్ యాత్ర అర్ధాంతరంగా నిలిచిపోయింది. వందలాది రోడ్లు మూసుకుపోయి, రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అసలు ఈ రెండు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది..? నష్టం ఏ స్థాయిలో ఉంది? ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి..?
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అల్లకల్లోలంగా మారాయి. వరద నీరు ఊళ్లను ముంచెత్తగా, వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో పలువురు గల్లంతయ్యారు. సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి: రవాణా వ్యవస్థ స్తంభం: కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 రోడ్లు మూతపడ్డాయి. సిమ్లా, మండి, కులు, సోలన్‌లలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సోలన్‌లో ఓ వంతెన వరద ఉద్ధృతికి కుప్పకూలింది.
నిలిచిన కైలాష్ యాత్ర: కిన్నౌర్ జిల్లాలో పవిత్ర కైలాష్ యాత్ర మార్గంలో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. ఐటీబీపీ సిబ్బంది వెంటనే స్పందించి, సుమారు 413 మంది యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ట్రెక్కింగ్ మార్గాలు పూర్తిగా ధ్వంసం కావడంతో, యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
రైల్వే ట్రాక్‌పై శిథిలాలు: ప్రపంచ వారసత్వ సంపద అయిన కల్కా-శిమ్లా రైల్వే ట్రాక్‌పై పలుచోట్ల కొండచరియలు విరిగిపడి, శిథిలాలు పేరుకుపోయాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ నష్టం: ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రజా పనుల శాఖకు జరిగిన నష్టం రూ.417 కోట్లు దాటినట్లు అంచనా. ఒక్క మండి జిల్లాలోనే రూ.56 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. పాంగ్ డ్యామ్ గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లో ఉగ్రరూపం..
గంగానది మహోగ్రం: హరిద్వార్, రిషికేశ్‌లలో గంగానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. రిషికేశ్‌లోని ప్రఖ్యాత పరమార్థ్ నికేతన్ ఆశ్రమంలో ఉన్న శివుడి విగ్రహాన్ని గంగాజలం తాకుతూ ప్రవహిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఘాట్‌ల వద్దకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
సైనికుల గల్లంతు, రక్షణ చర్యలు: ఉత్తరకాశీలో ఆకస్మిక వరదల్లో 11 మంది సైనికులు గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి, సుమారు 150 మందిని రక్షించాయి. రాష్ట్రవ్యాప్తంగా 4 జాతీయ రహదారులతో పాటు 617 రోడ్లు రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి.
రంగంలోకి ప్రభుత్వం: సీఎం పుష్కర్ సింగ్ ధామి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం ధామితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు.
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నాయి. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. రానున్న రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పడితేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.


