Vande Bharat RSS song controversy : ఎర్నాకులం-బెంగళూరు మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవం రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) గీతం ‘గణ గీతం’ను పాడించడంపై ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించే చర్య అని, జాతీయ సంస్థలను సంఘ్ పరివార్ రాజకీయాలకు ఉపయోగపడేలా మార్చుతున్నారని ఆరోపించారు. సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, కాంగ్రెస్ నాయకులు కూడా ఈ ఘటనను ఖండించారు. విమర్శల నేపథ్యంలో దక్షిణ రైల్వే సోషల్ మీడియా పోస్ట్‌ను తొలగించింది.
ALSO READ: India Pakistan Match: 2028 ఒలింపిక్స్‌లో భారత్-పాకిస్థాన్ పోరు డౌటే!
ఎర్నాకులం రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రారంభోత్సవంలో విద్యార్థులు ఆర్‌ఎస్‌ఎస్ గీతాన్ని ఆలపించిన వీడియోను దక్షిణ రైల్వే తన అధికారిక ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఈ గీతం ఆర్‌ఎస్‌ఎస్ ఐడియాలజీని ప్రతిబింబిస్తుందని, మతపరమైన, విభజనాత్మక భావాలను ప్రోత్సహిస్తుందని విమర్శకులు అంటున్నారు. టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో వ్యాప్తమైన ఈ దృశ్యాలు వివాదాన్ని మరింత ఊపందుకునేలా చేశాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం మరో చర్చనీయంశంగా మారింది.
సీఎం పినరాయి విజయన్ X (ట్విటర్)లో స్పందిస్తూ, “విద్వేషం, మతతత్వ భావాలను ప్రచారం చేసే సంస్థ గీతాన్ని అధికారిక కార్యక్రమంలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధం. రైల్వే లౌకిక జాతీయవాదానికి ప్రతీకంగా ఉండాలి, మతతత్వవాదానికి సాధనంగా కాదు” అని ఖండించారు. ఈ చర్య ప్రమాదకరమని, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఏకమై ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ ఘటన రాజకీయ వివాదాన్ని మరింత ఊపందుకునేలా చేసింది. కేరళలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీపై ఎప్పటికీ తీవ్ర విమర్శలు ఉండటంతో, ఈ ఘటన సీపీఎం, కాంగ్రెస్ మధ్య కూడా చర్చకు దారితీసింది.
సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్, “వందే భారత్ ప్రారంభోత్సవాన్ని పూర్తిగా రాజకీయం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ గీతాన్ని చేర్చడం ద్వారా రైల్వే అథమస్థాయికి దిగజారింది. ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి రాజకీయ ఆర్భాటం చేస్తున్నారు” అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కూడా దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన రాజ్యాంగ విలువలను దెబ్బతీస్తోందని, జాతీయ సంస్థలను రాజకీయ ఆయుధాలుగా మార్చకూడదని వారు అంటున్నారు.


