భారతీయ రైల్వే వ్యవస్థలో(Indian Railways) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణం కల్పించే దిశగా వడివడిగా అడుగులు పడ్డాయి. ఈ క్రమంలోనే వందే భారత్ స్లీపర్ రైళ్ల(Vande Bharat Sleeper)ను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్ నిర్వహించింది. 180 కిలోమీటర్ల వేగంలోనూ రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో నిండుగా ఉన్న నీరు తొనకకుండా రైలు ప్రయాణం సాఫీగా సాగింది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు.
జనవరి 1వ తేదీన రైలును గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిపారు. ఆ తరువాత 140, 150, 160 కిలోమీటర్లకు పెంచారు. అనంతరం గురువారం సాయంత్రం గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్స్ విజయవంతం అయ్యాయి. దీంతో వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో న్యూఢిల్లీ – పూణే, న్యూఢిల్లీ – శ్రీనగర్ సహా పలు మార్గాల్లో వందేభారత్ స్లీపర్ రైలును నడపనున్నారు.
వందే భారత్ స్లీపర్ రైలులో దాదాపు విమానం తరహా సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి. అన్ని కోచ్‌లలో సీసీ టీవీ నిఘా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్యాసింజర్, రైలు మేనేజర్ లేదా లోకో పైలట్ మధ్య కమ్యూనికేషన్ కోసం ఎమర్జెన్సీ టాక్ -బ్యాక్ యూనిట్ సదుపాయం ఉంది.