history of Vande Mataram : “సుజలాం సుఫలాం మలయజ శీతలాం…” ఈ పదాలు వినగానే ప్రతి భారతీయుడి హృదయం దేశభక్తితో ఉప్పొంగుతుంది. స్వాతంత్య్ర సంగ్రామంలో సమరయోధులకు ఊపిరిగా, స్వతంత్ర భారతంలో జాతీయ గేయంగా అజరామర కీర్తిని పొందిన ‘వందేమాతరం’.. ఓ అక్షర జ్వాల. ఈ అమర గానం మన చెంతకు చేరి ఈ నవంబరు 7వ తేదీ నాటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని మహారాష్ట్రలో వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసలు ఈ గీతం ఎలా పుట్టింది..? బ్రిటిష్ అధికారి కలం నుంచి జాలువారిన ఈ జాతీయతావాద గీతానికి స్ఫూర్తినిచ్చిన ఆ చారిత్రక తిరుగుబాటు ఏమిటి..?
స్ఫూర్తినిచ్చిన సన్యాసి-ఫకీర్ల తిరుగుబాటు : ‘వందేమాతరం’ గేయం బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ రచించిన ‘ఆనంద్‌మఠ్’ నవలలోనిది. ఈ నవల రచనకు బీజం పడింది 1770ల నాటి బెంగాల్‌లో. దారుణమైన కరువుతో ప్రజలు అల్లాడుతుండగా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల పన్నుల పీడనానికి వ్యతిరేకంగా హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు ఏకమై చారిత్రాత్మక తిరుగుబాటు చేశారు. వారు కంపెనీ ఖజానాలను, ఆహార గోదాములను దోచుకుని పేద ప్రజలకు పంచిపెట్టారు. మతాలకు అతీతంగా సాగిన ఈ ఐక్య పోరాటమే బంకిమ్ చంద్రుడిలో జాతీయతా భావాన్ని రగిలించి ‘ఆనంద్‌మఠ్’ నవలకు ప్రాణం పోసింది.
బ్రిటిష్ కొలువులో.. భారతీయ ఆత్మతో : ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ ఈ గీతాన్ని రాసే నాటికి బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. 1875, నవంబరు 7న ఈ గేయాన్ని కూర్చారు. కోల్‌కతా విశ్వవిద్యాలయం తొలి గ్రాడ్యుయేట్లలో ఒకరైన ఆయన, ప్రభుత్వ కొలువులో ఉంటూనే తన రచనల ద్వారా స్వాతంత్ర్య కాంక్షను రగిలించారు. 1882లో ప్రచురితమైన ‘ఆనంద్‌మఠ్’ నవల, ఆ తర్వాత 1905 నాటి బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. ‘వందేమాతరం’ నినాదం యావత్ దేశాన్ని ఏకతాటిపై నడిపించింది.
జాతీయ గేయంగా గుర్తింపు.. ఘనంగా వేడుకలు : దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక, 1950 జనవరి 24న రాజ్యాంగ సభ ‘వందేమాతరం’ గీతాన్ని ‘జనగణమన’తో సమానంగా గౌరవిస్తూ జాతీయ గేయంగా అధికారికంగా స్వీకరించింది. ఇప్పుడు, ఈ చారిత్రక గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. “ఈ వేడుకల కోసం పాఠశాల విద్య, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో వందేమాతరం ఆలాపన, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తాం,” అని రాష్ట్ర మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా వెల్లడించారు.


