Lottery Winner Amit Sehra: 32 ఏళ్ల అమిత్ సెహ్రా రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ జిల్లాలో కోట్పుట్లి పట్టణానికి చెందిన సాధారణ కూరగాయల వ్యాపారి. చిన్న రోడ్డు పక్కన బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషించే ఆయన జీవితాన్ని.. ఒక్క లాటరీ టికెట్ మలుపు తిప్పింది. తాజాగా పంజాబ్ స్టేట్ లాటరీ నిర్వహించిన దీపావళి బంపర్ 2025 డ్రాలో ఆయన ఏకంగా రూ.11 కోట్ల గ్రాండ్ ప్రైజ్ గెలిచారు.
ఒక పర్యటనలో పంజాబ్‌లోని బతిండాకు వెళ్లినప్పుడు.. అమిత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. డబ్బు లేక స్నేహితుడి దగ్గర రూ.వెయ్యి అప్పు తీసుకుని రెండు లాటరీ టికెట్లు కొన్నాడు. ఒకటి తనకోసం, మరొకటి భార్యకోసం. భార్య టికెట్‌కు రూ.వెయ్యి వచ్చినా, ఆయన టికెట్ మాత్రం జాక్‌పాట్ సాధించింది. లుధియానాలో నిర్వహించిన డ్రా ఫలితాల రాకతో కోట్పుట్లి పట్టణంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ గెలుపు సంతోషంతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదని.. తన బాధలు ఈ రోజుతో పోయాయని ఆనందంతో ఆశ్చర్యంతో చెప్పాడు అమిత్.
ఇది తనకు హనుమాన్ స్వామి ఇచ్చిన ఆశీర్వాదం అని.. పంజాబ్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. ప్రతి దరిద్రుడికీ ఇలాగే మంచి రోజులు రావాలని ఆకాంక్షించాడు. తన జీవితాన్ని మార్చిన ఈ అదృష్టానికి సాక్ష్యంగా, స్నేహితుడి కుటుంబాన్ని కూడా మరవకుండా ఆయన ఉదారత చూపాడు. తాను టికెట్ కొట్టడానికి రూ.1,000 ఇచ్చిన స్నేహితుడి ఇద్దరు కుమార్తెలకు రూ.50 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పాడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయానని అందుకే వారి బాధలు తాను అర్థం చేసుకోగలన్నాడు అమిత్.
మిగతా డబ్బును తన పిల్లల చదువు, ఇంటి నిర్మాణం, కుటుంబ భవిష్యత్తు కోసం ఉపయోగించనున్నట్లు చెప్పాడు. తన బహుమతి క్లెయిమ్ కోసం చండీగఢ్ వెళ్లడానికి కూడా డబ్బు లేక ఇబ్బంది పడిన అమిత్.. చివరికి దేవుని కృపతో అన్ని చర్యలు పూర్తి చేశారు. నవంబర్ 4న బతిండాలో కుటుంబంతో కలిసి లాటరీ డిపార్ట్‌మెంట్ అధికారుల ముందు అన్ని ప్రక్రియలు పూర్తిచేశాడు. ఇప్పుడు కోట్పుట్లి వీధుల్లో అమిత్ పేరు ప్రతి ఇంట్లో మారుమోగిపోతోంది. పొరుగువారు, వ్యాపారులు ఆయన కోసం మిఠాయిలు పంచుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


