BRS abstain from vice presidential election: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు నేడు (మంగళవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనంలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో సాయంత్రం 5 వరకు ఈ ఓటింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం విజేతను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ కూటమి, విపక్ష ఇండియా కూటమి పోటీపడుతున్నాయి. అయితే, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్‌ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు దూరంగా ఉండనున్నాయి. ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. దీంతో బీజేడీ (7), బీఆర్‌ఎస్ (4), శిరోమణి అకాలీదళ్(1) ఎంపీలు ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు.
కాగా, పార్లమెంటు ఉభయసభల్లో మొత్తం సభ్యుల సంఖ్య 788 ఉండగా.. ఇందులో ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం మొత్తం ఎలక్టోర్ల సంఖ్య 781కు చేరింది. వీరిలో లోక్‌సభ నుంచి 542 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 239 ఎంపీలు ఓటు హక్కు కలిగి ఉన్నారు. కాగా, ఎన్డీయే సంఖ్యా బలం లోక్ సభలో 304, రాజ్యసభలో 141గా ఉంది. బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన(షిండే), లోక్ జనశక్తి (చిరాగ్ పశ్వాన్), అన్నాడీఎంకే, జేడీఎస్, జనసేన, రాష్ట్రీయ లోక్‌దళ్, అప్నాదళ్(సోనేలాల్), ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గం,ఆల్ జార్ఖండ్ స్టుడెంట్స్ యూనియన్, హిందూస్తానీ ఆవామ్ మోర్చా, సిక్కిం క్రాంతికారీ మోర్చా, ఏజీపీ,యుపిపిఎల్, ఆర్‌పీఐ, వైసీపీ, ఆర్‌ఎల్‌ఎం పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో పాటు పలువురు స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నారు.
ఎన్డీఏ అభ్యర్థికే విజయావకాశాలు..
కాగా, తమిళనాడుకు చెందిన ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి నుంచి బరిలో ఉన్నారు. ఎన్డీఏకు లోక్‌సభలో 293, రాజ్యసభలో 129 సభ్యులు ఉన్నారు. ఉభయసభల్లో ఎన్డీఏ సంఖ్యా బలం మొత్తం 422. అయితే, ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్డీఏ బలపర్చిన అభ్యర్థికి అవసరమైన మెజారిటీ కంటే 28 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎన్నికల వేళ తెలంగాణ సీఎం రేవంత్ ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక పర్యవేక్షణతో పాటు, కేంద్ర మంత్రులతో భేటి అయ్యే అవకాశం ఉంది. అటు ఏపీ మంత్రి లోకేష్ కూడా ఢిల్లీలోనే పర్యటించనున్నారు. ఎంపీలతో మంత్రాంగం, కేంద్రం మంత్రులతో భేటి అయ్యే అవకాశం ఉంది.
ఇండియా కూటమి బలాబలాలివే..
ఇక, ఇండియా కూటమి బలాబలాల విషయానికి వస్తే.. ఇండియా కూటమికి ప్రస్తుతం లోక్ సభలో 234, రాజ్యసభలో 86 మంది సభ్యులున్నారు. ఇండియా కూటమికి కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన(ఉద్దవ్ థాకరే), ఎన్‌సీపీ(శరద్ పవార్), ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, జేఎంఎం, సీపీఐఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్,వీసీకే, భారత్ ఆదివాసీ పార్టీ, కేరళ కాంగ్రెస్, ఎండీఎంకే, ఆర్‌ఎల్‌టీపీ, ఆర్‌ఎస్‌పీ, ఎంఎన్‌ఎం(కమల్ హాసన్) ఏజీఎం పార్టీలు మద్దతిస్తున్నాయి. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ పాల్గొనకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చర్య పరోక్షంగా ఎన్‌డీఏ అభ్యర్థికి మద్ధతివ్వడమేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, తెలంగాణ ప్రజల కష్టాలు పట్టని బీజేపీ, కాంగ్రెస్ పార్టీకు మద్ధతిచ్చేది లేదని బీఆర్‌ఎస్ తెగేసి చెబుతోంది.


