Vice President C.P. Radhakrishnan on Devolopment: భారత నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత ఎన్నికలో, ఆయన ‘ఇండియా’ కూటమి ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఫలితాలు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాధాకృష్ణన్, తన విజయాన్ని ప్రతి భారతీయుడి విజయంగా అభివర్ణించారు.
అదే సమయంలో, ప్రతిపక్షాలకు సున్నితంగా చురకలంటించారు. “ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాలు రెండూ నాణానికి రెండు వైపుల లాంటివి. కానీ, ప్రతి విషయంలోనూ రాజకీయం చేయడం మానుకుని, దేశాభివృద్ధిపై దృష్టి సారించాలి,” అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన తన తొలి ప్రసంగంలో ప్రతిపక్షాలకు ఎలాంటి సందేశం ఇచ్చారు..? ‘వికసిత భారత్’ సాధనపై ఆయన వైఖరి ఏంటి..?
“ఇది భారతీయుడి విజయం” : తన విజయంపై హర్షం వ్యక్తం చేసిన రాధాకృష్ణన్, ఉపరాష్ట్రపతిగా తన కర్తవ్యాన్ని స్పష్టం చేశారు. దేశాభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని, అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్న ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, సంకుచిత రాజకీయాలను పక్కనపెట్టాలని ఆయన హితవు పలికారు.
“2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే, ప్రతి విషయంలోనూ రాజకీయాలు చేయకూడదు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండూ ముఖ్యమైనవే. ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతాను.”
– సి.పి. రాధాకృష్ణన్, నూతన ఉపరాష్ట్రపతి
సైద్ధాంతిక పోరుపై స్పందన: ఎన్నికల ప్రచారంలో భాగంగా, ‘ఇండియా’ కూటమి ఈ పోటీని ఒక సైద్ధాంతిక పోరాటంగా అభివర్ణించింది. ఈ వ్యాఖ్యలపై రాధాకృష్ణన్ తనదైన శైలిలో స్పందించారు. “ప్రతి పదవికి దాని సొంత పరిమితులు, ప్రాముఖ్యత ఉంటాయి. ఆ పరిధిలోనే పనిచేయాలి. అవతలి పక్షం దీనిని సైద్ధాంతిక పోరాటం అని చెప్పింది. కానీ, ఓటింగ్ సరళిని బట్టి చూస్తే, జాతీయవాద భావజాలమే విజయం సాధించిందని స్పష్టంగా అర్థమవుతుంది,” అని ఆయన అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరూ అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
వెల్లువెత్తిన అభినందనలు : నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి. రాధాకృష్ణన్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.
ప్రధాని మోదీ: ఫలితాలు వెలువడిన వెంటనే, ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులతో కలిసి రాధాకృష్ణన్ నివాసానికి వెళ్లి వ్యక్తిగతంగా అభినందించారు. “ఆయన జీవితం సమాజ సేవకే అంకితం. ఆయన ఒక గొప్ప ఉపరాష్ట్రపతిగా నిలుస్తారు. రాజ్యాంగ విలువలను బలోపేతం చేస్తారని నేను విశ్వసిస్తున్నాను,” అని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
రాష్ట్రపతి ముర్ము: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితంలో ఆయనకున్న అపార అనుభవం దేశాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ విజయంతో, రాధాకృష్ణన్ దేశ రెండో అత్యున్నత పీఠాన్ని అధిరోహించనున్నారు. రాజ్యసభ ఛైర్మన్‌గా ఆయన సభా కార్యకలాపాలను ఎలా నడిపిస్తారో, అధికార, ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఎలా సాధిస్తారోనని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


