Gurugram Viral video: యువత చేష్టలు మితిమీరిపోతున్నాయి. సరదాల కోసం చేస్తున్న పనులు వారి ప్రాణాలతోపాటు మిగతా వాళ్లను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. కొందరు యువకులు రీల్స్ కోసం చేస్తున్న విన్యాసాలు ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. హర్యానాలో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ.
గురుగ్రామ్‌లోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో కొందరు యువకులు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం వారు కార్లతో రోడ్డుపై నానా హంగామా సృష్టించారు. దాదాపు రెండు డజన్ల కార్లు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్‌సీ వంటి భారీ ఖరీదైన కారు కూడా ఉంది. దీని ఎక్స్ షోరూం ధర దాదాపు రూ. 80 లక్షలు. తాజా ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఒక మెర్సిడెస్ కన్వర్టిబుల్‌లో ఇద్దరు వ్యక్తులు పైకప్పు తెరిచి నిలబడి ఉండటం గమనించవచ్చు. మిగతా కార్ల నుంచి కొందరు సన్‌రూఫ్‌ల నుంచి, మరికొందరు ఫుట్‌రెస్ట్‌ల మీద నిలబడి హంగామా చేశారు. ఈ వాహనాలకు చట్టవిరుద్ధంగా సైరన్‌లు, హూటర్లు అమర్చడంతోపాటు నానా హడావుడి చేశారు. వీటి శబ్ధాలు చాలా దూరం వరకు వినిపించాయని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయి పోలీసుల దగ్గరకు చేరింది.
దీనిపై గురుగ్రామ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ వీడియోను ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందో వారికి పంపించి దర్యాప్తు చేపట్టారు. యాంక్వైరీ జోరుగా సాగుతోందని పోలీస్ అధికారి సందీప్ కుమార్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తామని.. త్వరలోనే నిందుతులను, వాహనాలను పట్టుకుంటామని పేర్కొన్నారు. త్వరలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. నిందితులపై కఠిన చర్యల తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రదేశంలో తరుచూ ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని.. నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


