Vijay swearing in as CM tomorrow: గత మూడ్రోజులుగా ట్విస్టుల మీద ట్విస్టులతో రసవత్తరంగా సాగిన తమిళ రాజకీయంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎట్టకేలకు తమిళనాట రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంతో పాటు వీసీకే పార్టీలు మద్దతు ప్రకటించడంతో మెజార్టీ మార్కును చేరుకుంది. దీంతో విజయ్ శుక్రవారం సాయంత్రం లోక్‌భవన్‌కు వెళ్లి మరోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. మ్యాజిక్ ఫిగర్‌పై స్పష్టత రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అంగీకరించారు. దీంతో, శనివారం (మే 9న) ఉదయం 11గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేస్తారని సీపీఎం నేత కె.బాలకృష్ణన్ వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/national-news/tvk-vijay-tweet-on-inter-results/
సీపీఎం కార్యాలయానికి విజయ్..
టీవీకే పార్టీకి ఆలస్యంగానైనా వామపక్షాలు మద్దతు తెలపడంతో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారానికి మార్గం సుగమమైంది. ఈ క్రమంలో తనకు మద్దతు ప్రకటించిన సీపీఐ, సీపీఎం కార్యాలయాలకు నేరుగా వెళ్లిన విజయ్.. ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. మరోవైపు, ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా.. తాజాగా సీపీఎం, సీపీఐ, వీసీకే సమ్మతి తెలపడంతో విజయ్ సారథ్యంలో ప్రభుత్వం కొలువుదీరేందుకు రంగం సిద్ధమవుతోంది. పార్టీల వారీగా సంఖ్యాబలాలు పరిశీలిస్తే.. టీవీకే 107, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 స్థానాలను కలిగి ఉన్నాయి.
Also Read: https://teluguprabha.net/national-news/line-clear-for-vijay-sarkar/
మంత్రివర్గంలో చేరమన్న లెఫ్ట్ పార్టీలు..
టీవీకేకు బయట నుంచే తాము మద్దతిస్తామని.. ప్రభుత్వంలో చేరబోమని సీపీఎం నేత వాసుకి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు ఈ రోజు సమావేశమయ్యాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు బయటి నుంచే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. అసెంబ్లీలో బల పరీక్ష సమయంలో టీవీకేకు మద్దతుగానే కచ్చితంగా ఓటు వేస్తాం. కానీ, మంత్రివర్గంలో మాత్రం చేరం. ఇది కేవలం బయటి నుంచి మద్దతే. వామపక్షాలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని వీసీకే సైతం చెప్పింది. అందువల్ల, వారు కూడా అదే తరహాలో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. ప్రజలు టీవీకేకు అధిక మెజార్టీ ఇచ్చారు. వారి విశ్వాసం మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలనే ఉద్దేశ్యంతో మేం మద్దతు తెలుపుతున్నాం. ప్రజా సమస్యల ఆధారంగానే మేం స్వతంత్రంగా వ్యవహరించి పనిచేస్తాం. లౌకికవాదం, ప్రజల ఐక్యత, రాష్ట్రాల హక్కులు.. ఇలా ఇతర ఏ అంశమైనా సరే ప్రస్తావనకు వచ్చినప్పుడు మాతో కలిసొచ్చే ఏ లౌకిక పార్టీతోనైనా కలిసి నడుస్తాం’’ అని ఆమె స్పష్టం చేశారు.

