అఖిల భారత డ్వాక్రా బజార్ పేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువుల ప్రదర్శన, విక్రయాలు ప్రారంభం కానున్నాయి. స్థానిక ట్యాంక్ బండ్ రోడ్డును ఆనుకొని మాన్సాస్ గ్రౌండ్స్‌లో డిఆర్‌డిఏ ఆధ్వర్యంలో ఈ బజార్‌ను ఏర్పాటు చేశారు. దీనిని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నారు.
ఈ సరస్ (Sales of Articles of Rural Artisans Society (SARAS)) లో మన రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలతో, పాటు తెలంగాణా, భారత దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులు పాల్గొంటాయి. సుమారు 250 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. దీనిలో నాణ్యమైన, వైవిద్యమైన ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం నిర్వహిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పేద గ్రామీణ మహిళలను సంఘాలుగా ఏర్పాటు చేసి, వారి ఆర్ధిక అభివృద్ధికి కావలసిన తోడ్పాటును అందిస్తున్నది. దీనిలో భాగంగా గ్రామీణ మహిళలచే తయారు చేయబడిన ఉత్పతులకు సరి అయిన మార్కెట్ సదుపాయాలు
అందించేందుకు గాను ఇటువంటి ప్రదర్శనలను ఏర్పాటు చేస్తోంది. దీనిలో బాగంగానే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాల ఉత్పతులను ప్రధాన నగరాలలో విక్రయించు కోవడానికి, వారి ఉత్పతులకు తగిన ధరతో పాటు ప్రజాధరణ పొందడానికి కృషి జరుగుతోంది. దీనికోసం అఖిల భారత డ్వాక్రా బజార్ లను ఏర్పాటు చేశారు.
విజయనగరం జిల్లాలో శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ, విజయనగరం ఉత్సవాల సందర్బంగా, కేంద్రప్రభుత్వ సహకారంతో, మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సరస్-2023 పెద్ద చెరువు గట్టు క్రింద, అంబేడ్కర్ జంక్షన్ (బాలాజీ జంక్షన్) వద్ద ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శన 28వ తేదీ నుంచి నవంబరు 8వ తేదీ వరకు జరుగుతుంది. ఉదయం 10 గంటలు నుంచి రాత్రి 9 గంటలు వరకు స్టాల్స్ తెరిచి ఉంటాయి. ఈ కార్యక్రమం నిర్వహణకు కేంద్రప్రభుత్వంతో పాటు నాబార్డ్, మెప్మా, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, సిడ్బి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నాయి.
ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొనే స్వయం సహాయక సబ్యులందరికి డిఆర్‌డిఏ ఆధ్వర్యంలో ఉచిత వసతి, భోజనం మరియు రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది పైడితల్లి అమ్మవారి పండుగ, విజయనగరం ఉత్సవాలకు ఈ సరస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ప్రదర్శించే వస్తువులు ఇవే
ఈ ఎగ్జిబిషన్ లో వెదురు ఉత్పత్తులు, వస్త్ర ఉత్పత్తులు, చీరలు, జ్యూవెలరీ, హ్యాండ్ లూమ్, డ్రై ఫ్లవర్స్, హ్యాండి క్రాఫ్ట్, బెడ్ షీట్స్, గృహాలంకరణ వస్తువులు, హ్యాండ్ లూమ్స్, కుర్తాలు, రెడీమేడ్ దుస్తులు, హ్యాండి క్రాఫ్ట్, ఆభరణ వస్తువులు, మసాలా దినుసులు ప్రదర్శిస్తారు. అలాగే కార్పెట్లు, డ్రై ప్రూట్స్, ఆర్టిఫీషియల్ జ్యూవేలరి, హ్యాండ్లూమ్స్ ఉత్పత్తులు, జ్యూట్ బోర్డ్ ఉత్పత్తులు, నాబార్డ్, మెప్మా, తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తులు పోచంపల్లి, గద్వాల్ వస్త్రాలు ఇక్కడ అందుబాటులో, సరసమైన ధరల్లో లభిస్తాయి.
ఇవే కాకుండా వివిధ ఆహార ఉత్పత్తుల ప్రదర్శన-అమ్మకాలు జరుగుతాయి. మన రాష్ట్రంలోని రాయలసీమ రుచులుతో పాటు ఇతర రాష్ట్రములకు చెందిన సాంప్రదాయక వంటకాలతో ఈ ఎగ్జిబిషన్ నందు ఫుడ్ కోర్ట్ లను ఏర్పాటుచేయడం జరిగింది. అదేవిధంగా సందర్శకులను, పిల్లలను అహ్లాదపరిచే కార్యక్రమములను ఏర్పాటు చేశారు. విజయనగరం ఉత్సవం సందర్భంగా ఇక్కడ కూడా సాంస్కృతి కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది.