Villagers Build Own Road: ఒక తరం మారిపోయింది.. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్లారు.. కానీ ఆ గిరిజన గ్రామ తలరాత మాత్రం మారలేదు. ప్రతి ఏటా వారే కష్టపడతారు.. కొండను తొలిచి బాట వేసుకుంటారు. వాన దేవుడు కరుణిస్తే ఆరు నెలలు రాకపోకలు.. కుండపోతగా కురిస్తే చేసిన శ్రమంతా గంగపాలు. ఇది ఛత్తీస్‌గఢ్‌లోని ఓ మారుమూల గ్రామస్థుల 24 ఏళ్ల వ్యధ. అసలు రెండు దశాబ్దాలుగా అధికారులు ఎందుకు స్పందించడం లేదు..?
అభివృద్ధి పరుగులు పెడుతోందని పాలకులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న అగాధానికి ఈ గ్రామమే నిలువుటద్దం. ఛత్తీస్‌గఢ్‌లోని ధమతరి జిల్లాలో ఉన్న నాథూకోన్హా గ్రామస్థులు, ప్రభుత్వాల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తూ, తమ బతుకుబాటను తామే నిర్మించుకుంటున్నారు. గత 24 ఏళ్లుగా ప్రతి సంవత్సరం కొండను తొలిచి, రోడ్డు వేసుకుంటూ అధికారులకు తమ నిరసనను వినూత్నంగా తెలియజేస్తున్నారు.
తరాలు మారుతున్నా.. తీరని వ్యధ : నాథూకోన్హా ఒక చిన్న గిరిజన గ్రామం. ఇక్కడ సుమారు 140 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు. దీంతో రేషన్, వైద్యం, విద్య వంటి ఏ కనీస అవసరం కోసమైనా వారు పక్కనే ఉన్న కేరిగావ్ అనే గ్రామానికి కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లాలి. ముఖ్యంగా వర్షాకాలంలో వీరి కష్టాలు వర్ణనాతీతం. ఉన్న ఒక్క మట్టిదారి కూడా బురదమయమై, రాకపోకలకు పూర్తిగా నిలిచిపోతుంది.
ALSO READ:https://teluguprabha.net/national-news/himachal-pradesh-floods-monsoon-fury-landslides-death-toll/
తమ గ్రామానికి ఓ పక్కా రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు గత 24 ఏళ్లుగా అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి నుంచి ప్రస్తుత సీఎం విష్ణు దేవ్ సాయి వరకు ఎందరో మారినా, తమ సమస్య మాత్రం పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొండను పిండి చేసి.. బాట వేసి : ఏళ్ల తరబడి వేచి చూసి విసిగిపోయిన గ్రామస్థులు, చివరకు తమ భుజస్కంధాలపైనే ఆ బాధ్యతను వేసుకున్నారు. పదునైన ఆయుధాలు లేకపోయినా, తమ ఇళ్లలో ఉన్న పలుగు, పారలతోనే ఓ సాహసానికి పూనుకున్నారు. రాకపోకలకు అడ్డుగా ఉన్న 250 మీటర్ల పొడవైన, 25 అడుగుల ఎత్తైన కొండను తొలిచి, తాత్కాలిక రహదారిని నిర్మించుకున్నారు.
అయితే, వారి కష్టం ప్రతి ఏటా వృథా అవుతూనే ఉంది. వర్షాకాలంలో కొండల పైనుంచి వచ్చే వరద నీటికి ఆ మట్టి రోడ్డు కొట్టుకుపోతుంది. దీంతో మళ్లీ యథాస్థితి. అయినా వారు నిరాశ చెందలేదు. ప్రతి ఏటా వర్షాలు తగ్గాక, మళ్లీ శ్రమదానం చేసి ఆ రోడ్డును పునరుద్ధరించుకుంటూనే ఉన్నారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/fake-embassy-ghaziabad-conman-arrested/
“పిల్లల చదువుల నుంచి అనారోగ్యానికి మందుల వరకు, ప్రతిదానికీ కేరిగావ్‌కు వెళ్లాలి. రోడ్డు లేక నరకం చూస్తున్నాం. అందుకే మేమే కలిసికట్టుగా పెద్ద బండలను తొలగించి రోడ్డు వేసుకున్నాం. దీనివల్ల ఇప్పుడు ఏ సమయంలోనైనా రాకపోకలు సాగించగలుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ మార్గాన్ని శాశ్వతం చేయాలి,” అని గ్రామస్థుడు సత్యనారాయణ మండావి కోరారు.
అధికారుల స్పందన.. ప్రశంసలకే పరిమితమా : “దాదాపు 25 ఏళ్లుగా పోరాడుతున్నా అధికారులు స్పందించలేదు. అందుకే మేమే శ్రమించి ఈ రహదారిని నిర్మించుకున్నాం,” అని గ్రామ సర్పంచ్ అక్బర్ మండావి తెలిపారు. ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో జిల్లా కలెక్టర్ అవినాశ్ మిశ్రా స్పందించారు. గ్రామస్థుల కృషిని ఎంతగానో ప్రశంసించారు. “స్వయంగా గ్రామస్థులే రహదారిని నిర్మించడం గొప్ప విషయం. త్వరలోనే నేను ఆ ప్రాంతాన్ని సందర్శించి, ప్రభుత్వం తరఫున చేయగలిగిన సహాయాన్ని తప్పకుండా చేస్తాను,” అని ఆయన హామీ ఇచ్చారు.


