Villagers Object, Christian Man Remains Unburied For 3 Days: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా, కోడేకుర్సే గ్రామంలో తీవ్ర వివాదం రాజుకుంది. మతం మారినందుకు, క్రిస్టియన్ వ్యక్తి మనీష్ నిషాద్ (50) మృతదేహాన్ని గ్రామంలో పాతిపెట్టడానికి గ్రామస్తులు నిరాకరించారు. దీంతో మృతుడి కుటుంబం మూడు రోజులుగా మృతదేహాన్ని గ్రామాల మధ్య తిప్పుతూ, అంత్యక్రియలు నిర్వహించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సమస్యేమిటంటే..
క్రిస్టియానిటీకి మారిన మనీష్ నిషాద్, మంగళవారం రాయ్‌పూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతదేహాన్ని వారి వ్యక్తిగత భూమిలోనే పాతిపెట్టడానికి కుటుంబ సభ్యులు గ్రామానికి తీసుకురాగా, గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సాంప్రదాయ విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారిని గ్రామం పరిధిలో ఖననం చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రజలు కోడేకుర్సే పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. పోలీసులు ఆ తర్వాత మృతదేహాన్ని కోడేకుర్సే ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ALSO READ: Midday Meals: చిత్తు కాగితాల్లో మధ్యాహ్న భోజనమా.. పేద విద్యార్థుల పట్ల ఇంత అమానుషమా, ఎక్కడంటే..?
శుక్రవారం, కుటుంబ సభ్యులు పోలీసుల రక్షణతో శాంతియుత అంత్యక్రియల కోసం చరామాకు మృతదేహాన్ని తరలించగా, అక్కడ హిందూ సంస్థల సభ్యులు వాహనాన్ని అడ్డగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, మృతదేహాన్ని రాయ్‌పూర్‌కు తరలించారు. మూడు రోజులు గడిచినా మృతదేహాన్ని ఇంకా ఖననం చేయలేకపోయారు.
సాంప్రదాయాలకు భంగం?
గ్రామస్తుల అభిప్రాయాన్ని జిల్లా పంచాయతీ సభ్యుడు దేవేంద్ర టేకం సమర్థిస్తూ, “కోడేకుర్సే సాంప్రదాయ ఆచారాలను అనుసరిస్తుంది. సమాజానికి సొంత అంత్యక్రియల వ్యవస్థ ఉంది. మృతదేహాన్ని ఖననం చేయాలంటే గ్రామ సంప్రదాయాన్ని అనుసరించాలి, లేదంటే గ్రామం వెలుపలకి తీసుకువెళ్లాలి” అని తెలిపారు.
ప్రగతిశీల క్రైస్తవ కూటమి రాష్ట్ర సమన్వయకర్త సైమన్ దిగ్బాల్ తాండీ మాట్లాడుతూ, క్రిస్టియన్ల కోసం కేటాయించిన రెండు శ్మశానవాటికల్లో స్థలం లేదనీ, కొత్తగా కేటాయించిన భూమి కూడా వివాదంలో ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలోని అనేక మంది గ్రామస్తులు క్రిస్టియన్ల ఖనన ఆచారాలను తమ సాంప్రదాయ గిరిజన ఆచారాలకు సవాలుగా చూస్తున్నారు.
ALSO READ: Bengaluru Jail: 20 మందిని రేప్ చేసి దర్జాగా జైల్లో టీవీ చూస్తూ ఫోన్లు మాట్లాడుతున్న ఖైదీ.. వీడియో


