Vice President Varanasi speech : గంగా నదిలో ఒక్కసారి మునిగితే పాపాలు పోతాయని నమ్మకం. కానీ ఆ పవిత్ర స్నానం ఏకంగా తన జీవన విధానాన్నే మార్చేసిందని, మాంసాహారిగా ఉన్న తనను శాకాహారిగా మార్చిందని స్వయంగా దేశ ఉపరాష్ట్రపతే చెబితే? కాశీ క్షేత్రంలో పర్యటించిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తన వ్యక్తిగత అనుభవాలతో పాటు, కాశీలో జరుగుతున్న అభివృద్ధి, ఉత్తర-దక్షిణ భారత సాంస్కృతిక బంధంపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంతకీ 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది? నేటి కాశీకి, నాటి కాశీకి ఆయన గమనించిన తేడా ఏంటి?
శాకాహారిగా మార్చిన గంగమ్మ : ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి వారణాసిలో పర్యటించిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, శ్రీ కాశీ నట్టుక్కోట్టై నగర సత్రం మేనేజింగ్ సొసైటీ నిర్మించిన నూతన సత్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన జీవితంలోని ఒక ముఖ్యమైన పరిణామాన్ని పంచుకున్నారు.
“నేను 25 సంవత్సరాల క్రితం మొదటిసారి కాశీకి వచ్చినప్పుడు మాంసాహారిని. గంగా నదిలో స్నానం చేసిన తర్వాత, నా జీవితంలో గణనీయమైన మార్పు వచ్చింది. నేను శాకాహారాన్ని స్వీకరించాను. ధర్మం తాత్కాలికంగా సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు, కానీ ఎప్పటికీ ఓడిపోదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
మోదీ-యోగీ వల్లే ఈ పరివర్తన : పాతికేళ్ల క్రితం తాను చూసిన కాశీకి, నేటి కాశీకి మధ్య ఎంతో తేడా ఉందని ఉపరాష్ట్రపతి కొనియాడారు. ఈ అద్భుతమైన పరివర్తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వమే కారణమని ప్రశంసించారు. వారి హయాంలో కాశీలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనం జరుగుతోందని పేర్కొన్నారు.
ఉత్తర-దక్షిణ వారధి : కాశీ-తమిళనాడు మధ్య శతాబ్దాల నాటి బంధాన్ని ఈ నూతన సత్రం మరింత బలోపేతం చేస్తుందని రాధాకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక భవనం కాదని, ఉత్తర-దక్షిణ భారతదేశం మధ్య సాంస్కృతిక బంధంలో ఒక కొత్త అధ్యాయమని అభివర్ణించారు. రూ.60 కోట్లతో ఈ సత్రం నిర్మాణానికి విరాళాలు అందించిన నాటుకోట్టై నాగరాథర్ సమాజం సేవానిరతిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
కాశీ తమిళ సంగమం వంటి కార్యక్రమాలు ఈ బంధాన్ని మరింత పటిష్టం చేశాయని, అలాగే వందేళ్ల క్రితం కాశీ నుంచి దొంగిలించబడిన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ప్రధాని మోదీ కృషితో కెనడా నుంచి తిరిగి తీసుకురావడం చారిత్రాత్మకమని ఆయన గుర్తుచేశారు. ప్రారంభోత్సవం అనంతరం, ఉపరాష్ట్రపతి కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి, దేశ ప్రజల శాంతి, శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.


