Warangal tourist places : పది రోజుల పండగ సెలవులు… పిల్లల సందడితో ఇళ్లన్నీ కళకళలాడుతున్నాయి. అయితే, ఆ ఆనందం సెల్‌ఫోన్ గేమ్‌లకే పరిమితమైతే ఎలా? వారి దృష్టిని విజ్ఞానం వైపు, మన చారిత్రక సంపద వైపు మళ్లిస్తే అదొక అద్భుతమైన అభ్యాసన అనుభవం అవుతుంది కదా? పాఠ్యపుస్తకాల్లో చదువుకున్న కోటలు, దేవాలయాలు, రాజుల కథలను కళ్లకు కట్టినట్లు చూపించే అవకాశం ఈ సెలవుల్లో మనకు లభిస్తుంది. ఇందుకోసం ఎక్కడికో వెళ్లనవసరం లేదు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అడుగడుగునా చారిత్రక అద్భుతాలు, ప్రకృతి సోయగాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పదండి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
అధ్యాత్మికత, ప్రకృతి మేళవింపు – వరంగల్, హనుమకొండ : కాకతీయుల కళావైభవానికి సజీవ సాక్ష్యం హనుమకొండలోని వేయి స్తంభాల గుడి. ఇక్కడి రుద్రేశ్వరస్వామిని దర్శించుకోవడంతో పాటు, నక్షత్రాకార మండపం, అద్భుతమైన శిల్పకళా సంపదను పిల్లలకు పరిచయం చేయవచ్చు. ఆనాటి ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని చూసి వారు అబ్బురపడటం ఖాయం. అక్కడికి సమీపంలోనే ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయం, దాని పక్కనే ఉన్న ప్రశాంతమైన భద్రకాళి సరస్సు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇక ప్రకృతి ప్రేమికుల కోసం హనుమకొండలో జంతు ప్రదర్శన శాల (జూ) కూడా ఉంది. ఇక్కడ ఎలుగుబంట్లు, చిరుతపులులు, జింకలు, మొసళ్లు, నెమళ్లు వంటి ఎన్నో జీవరాశులను దగ్గర నుంచి చూసే అవకాశం పిల్లలకు లభిస్తుంది. వీటితో పాటు చారిత్రక ఖిలా వరంగల్, పద్మాక్షి దేవాలయం, విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచే రీజినల్ సైన్స్ సెంటర్ కూడా తప్పక చూడాల్సిన ప్రదేశాలు.
యునెస్కో కీర్తి పతాక – ములుగు జిల్లా : ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ములుగు జిల్లాకే తలమానికం. ఎలాంటి ఆధునిక సాంకేతికత లేని రోజుల్లో తేలియాడే ఇటుకలతో ఆలయ గోపురాన్ని, అద్భుతమైన నల్లరాతి శిల్పాలతో మండపాలను నిర్మించిన తీరు అద్వితీయం. ఈ విశేషాలను పిల్లలకు వివరిస్తే వారిలో కొత్త ఆలోచనలు రేకెత్తుతాయి. రామప్పతో పాటు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర జరిగే మేడారం, కనువిందు చేసే బొగత జలపాతం, దట్టమైన అడవుల మధ్య ఏర్పాటు చేసిన తాడ్వాయి హట్స్, ఉయ్యాల వంతెనతో అలరించే లక్నవరం సరస్సు కూడా ఈ జిల్లాలోని ముఖ్య పర్యాటక ఆకర్షణలు.
త్రివేణి సంగమ తీరాన – భూపాలపల్లి జిల్లా : భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి నదుల త్రివేణి సంగమం ఉంది. ఇక్కడి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం ఒక ప్రత్యేకత. ఇది దేశంలోనే ప్రత్యేకమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్, అన్నారం బ్యారేజీని కూడా సందర్శించవచ్చు.
ఇవి కూడా చూడదగినవే : ఈ ప్రధాన ప్రాంతాలతో పాటు, పాకాల సరస్సు, పాండవుల గుట్టలు, కోటగుళ్లు, భీమునిపాదం జలపాతం, బమ్మెర పోతన స్మారక మందిరం, కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం, ఐనవోలు మల్లన్న క్షేత్రం వంటి అనేక ప్రదేశాలు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్నాయి.
ఇంట్లోనే ఇన్ని సరదా కార్యకలాపాలా : పర్యాటనకు వెళ్లడం వీలుకాని పక్షంలో, ఇంట్లోనే పిల్లలతో సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టవచ్చు. వారికి ఇష్టమైన బొమ్మలు గీయడం, రంగులు వేయడం వంటి వాటిని ప్రోత్సహించడం ద్వారా వారిలోని కళా నైపుణ్యానికి పదును పెట్టవచ్చు. బాల్యం నుంచే యోగాసనాలు నేర్పించడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే యోగా చేయడం అలవాటు చేస్తే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ సెలవులను కేవలం ఆటవిడుపుగానే కాకుండా, పిల్లలకు ఒక మంచి విజ్ఞానాన్ని, అనుభూతిని పంచే అవకాశంగా మలుచుకుందాం.


