ఆప్ కంచుకోటగా భావిస్తున్న దేశ రాజధాని ఢిల్లీలో(Delhi Election Results) కాషాయజెండా ఎగిరింది. 27 ఏళ్లుగా హస్తినలో పాలనకు దూరంగా ఉన్న బీజేపీ(BJP) ఈసారి విజయ దుందుభి మోగించింది. మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 47 స్థానాల్లో బీజేపీ విజయబావుటా ఎగరేసింది. ఆప్ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే మరోసారి సున్నాకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాల దెబ్బకు ఆమ్ ఆద్మీ పార్టీ దిగ్గజ నేతలు కూడా ఓడిపోయారు. ఆప్ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తదితర కీలక నేతలు ఓటమి చవిచూశారు.
అసలు బీజేపీ ఘన విజయానికి కారణాలు ఏంటంటే..
ఆదాయపు పన్ను: ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరట కల్పించింది. రూ.12లక్షల ఆదాయంలో ట్యాక్స్ ఉండదని ప్రకటించింది. దీంతో ఢిల్లీలో ఎక్కువగా ఉన్న మధ్యతరగతి ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు.
డబల్ ఇంజిన్ నినాదం: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఢిల్లీలో మాత్రం అధికారం లేకుండా పోయింది. దీంతో తమకు ఒక్క అవకాశం ఇస్తే డబల్ ఇంజిన్ ప్రభుత్వంతో దేశ రాజధాని అయిన ఢిల్లీని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని హామీ ఇవ్వడం.
యుమునా నది వివాదం: హిందువులు పవిత్రంగా భావించే యమునా నదిపై విషప్రయోగం జరిగిందని కేజ్రీవాల్ ఆరోపణలు చేయడం. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా నదిలో విషం కలిపి ఢిల్లీలో మారణహోమానికి పాల్పడుతోందంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
లిక్కర్ స్కాం: ఢిల్లీ రాజకీయాలను ఓ కుదుపు కుదుపేసింది లిక్కర్ స్కాం. ఈ స్కాంలో భారీ అవినీతి జరిగిందంటూ ఈడీ, సీబీఐ విచారణ చేయడం.. ఈ విచారణలో భాగంగా ఆప్ కీలక నేతలైన కేజ్రీవాల్‌తో పాటు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ జైలుకు వెళ్లడంతో ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోవడం.
శీష్ మహల్ కుంభకోణం: అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసమైన శీష్ మహల్‌లో ఆధునికీకరణ పనులు చేయడం. రూ.96 లక్షల విలువైన మెయిన్, షీర్ కర్టెన్లు, రూ.39 లక్షల విలువైన కిచెన్ ఎక్విప్మెంట్, రూ.4.80 లక్షల విలువైన మినీబార్, రూ.16.27 లక్షల విలువైన సిల్క్ కార్పెట్లు కనిపించాయి. ప్రజాధనాన్న దుర్వినియోగం చేసి కేజ్రీవాల్ విలాసాలు అనుభిస్తున్నారనే ఆరోపణలను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.
కీలక నేతల రాజీనామాలు: ఆప్ కీలక నేతలుగా ఉన్న కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ వంటి నేతల రాజీనామాలు. ఎన్నికలకు వారం రోజుల ముందు ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం.
ఆప్-కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం: లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఆప్-కాంగ్రెస్.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేశాయి. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోయినా చాలా నియోజకవర్గాల్లో ఆప్ ఓట్లకు గండి కొట్టింది. దాదాపు 15-20 నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్ధులు 1000-2000 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.