జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్ ఉంటుందని ఊహించని పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. దశాబ్దాలుగా పాకిస్థాన్‌తో అమల్లో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని(Indus Waters Treaty) తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఒప్పందం ఏమిటి..? ఈ ఒప్పందం నిలిపివేత పాకిస్థాన్‌కు ఎలాంటి నష్టం చేకూరుతుందనే చర్చ మొదలైంది.
సింధూ జలాల ఒప్పందం ఏమిటి..?
భారత్, పాకిస్థాన్ మధ్య సింధూ నదీ వ్యవస్థలోని జలాల పంపిణీ కోసం 1960 సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఖాన్ కరాచీలో దీనిపై సంతకాలు చేశారు. సింధూ నది, ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ జలాల వినియోగంపై ఇరు దేశాలకు హక్కులు, బాధ్యతలను ఈ ఒప్పందం నిర్దేశిస్తుంది.దీని ప్రకారం తూర్పు నదులుగా పరిగణించే రావి, బియాస్, సట్లెజ్‌లపై భారత్‌కు పూర్తి హక్కులు దక్కాయి. పశ్చిమ నదులైన సింధూ, జీలం, చీనాబ్ జలాలపై పాకిస్థాన్‌కు ప్రధాన హక్కులు ఉన్నాయి. అయితే ఈ పశ్చిమ నదులపై నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించకుండా జలవిద్యుత్, గృహ, వ్యవసాయ అవసరాల కోసం నీటిని వాడుకునేందుకు, ప్రాజెక్టులు నిర్మించుకునేందుకు భారత్‌కు అనుమతి ఉంది.
పాక్‌కు ఎలాంటి నష్టం..?
ఇప్పుడు ఇదే అంశంపై పాక్‌ను దెబ్బకొట్టేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సింధూ జలాల ప్రవాహం అడ్డుకునేలా భారీ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టనుంది. అయితే ఇప్పటికప్పుడు పాక్‌కు ఎలాంటి నష్టం జరగకపోయినా భవిష్యత్తులో మాత్రం ఆ దేశం ఎడారిగా మారడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. నీటి కొరత ఉండటం వల్ల వ్యవసాయ ఆధారిత దేశంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థికంగా పతనం అవుతుందని విశ్లేషిస్తున్నారు.